దుర్మార్గులకు శిక్ష పడాలి
● నిర్లక్ష్యంగా వ్యవహరించిన
పోలీసులపై చర్యలు తీసుకోండి
● కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
సాక్షి, నాగర్‌కర్నూల్: కుమ్మెర ఘటనలో దాడికి పాల్పడిన నిందితులందరిపై హత్య కేసు నమోదు చేయాలని, అందరికీ శిక్షపడేలా చూడాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్‌ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి కమిషన్ తరపున రూ.లక్ష చెక్కును అందజేశారు. కుమ్మెరలో కుటుంబం జీవించలేని పరిస్థితులు ఉన్నాయని వారికి రక్షణ కల్పించాలని సూచించారు. జిల్లాకేంద్రంలో డబుల్ బెడ్రూం ఇల్లు ఏర్పాటు, గణేశ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
పసిపాప అని చూడకుండాకాలితో తన్నాడు..
కుమ్మెర మల్లన్న జాతరలో తాను ఎంత ప్రాధేయపడినా వినకుండా దాడికి పాల్పడ్డారని బాధితురాలు మౌనిక ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలు మౌనిక మీడియా ఎదుట ఘటన తీరును వివరించారు. ‘మల్లన్న జాతరలో దేవుని దర్శనం కోసం వెళ్లిన మమ్మల్ని శ్రీనివాస్‌రెడ్డి అనుమతించలేదు. తక్కువ జాతివాళ్లు అంటూ తిట్టారు. ఎందుకు తిట్టావని అడిగేందుకు నా భర్త వెళ్తే కొబ్బరికాయల గదిలో అందరూ దాడి చేసి కొట్టారు. మా అత్తమ్మను జుట్టు పట్టుకుని కొట్టారు. పసిపాప ఉందని చెప్పి ప్రాధేయపడినా వినకుండా మధుసూదన్‌రెడ్డి పాపని కాలితో తన్నాడు. కిందపడ్డ పాపను మా ఆడబిడ్డ తీసుకుని భుజాన ఎత్తుకుంది. రెండు రోజులపాటు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పోలీసులు పట్టించుకోలేదు. వాళ్లకు శిక్షపడితేనే నాకు న్యాయం జరిగిందని భావిస్తాను’ అని మౌనిక వివరించారు.
దుర్మార్గులకు శిక్ష పడాలి


