
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట రూరల్: హైదరాబాద్‌లోని బేగంపేట, రామంతాపూర్‌లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఒకటో తరగతిలో ప్రవేశానికి జిల్లాలోని గిరిజన బాల బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. 2025–2026 విద్యా సంవత్సరంలో డే స్కాలర్ విధానంలో ప్రవేశానికి 01–06–2018 నుంచి 31–05–2019 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని, కుల, ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, ఆధార్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించుకొని 8వ తేదీలోగా మహబూబ్‌నగర్ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ నెల 13న లాటరీ విధానంలో ఆరుగురిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
నేతన్నలు
దరఖాస్తు చేసుకోండి
నారాయణపేట: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకాలు అమలు చేస్తోందని.. అర్హులైన నేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత, జౌళిశాఖ అధికారి డి.బాబు గురువారం ఒక ప్రకటనలో కోరారు. నేతన్న భరోసా పథకంలో నమోదైన కార్మికులకు ఏడాదికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు మంజూరవుతాయని.. నేతన్న పొదుపులో నమోదైన కార్మికులు, అనుబంధ కార్మికులు ఆయా పథకాలకు అర్హులని పేర్కొన్నారు. అర్హులందరూ 5వ తేదీలోగా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, గతేడాది నేతన్న బీమా పథకంలో నమోదైన చేనేత కార్మికులు దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
బలవంతపు
భూ సేకరణ వద్దు
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతలలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వకుండా గత పాలకుల మాదిరిగా బలవంతంగా భూ సేకరణ చేపట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య ప్రభుత్వాన్ని కోరారు. భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు గురువారం 17వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని వారు సందర్శించి రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం మొండిగా ఎకరా రూ.14 లక్షలకు సేకరించి రైతుల కడుపుకొట్టడం సరికాదన్నారు. భూ నిర్వాసితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని.. తప్పించుకోవాలని చూస్తే ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు రైతులకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని భయపెట్టడం చూస్తే గత పాలకులకు పట్టిన గతే పడుతుందన్నారు. ఇకనైనా అధికారులు భూ నిర్వాసిత సంఘం ప్రతినిధులతో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీక్షలో ఎడవెల్లికి చెందిన భూ నిర్వాసితులు అంజప్ప, లక్ష్మణ్, నర్సింహులు, కిష్టప్ప, హన్మంతు ,శ్రీనివాసులు, బాలప్పతో పాటు భూ నిర్వాసిత సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, మశ్ఛందర్,బాల్‌రాం, మహేష్‌కుమార్‌గౌడ్, ధర్మరాజు, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్, అంజప్ప తదితరులు పాల్గొన్నారు.
వినూత్న బోధనతో
ఆకట్టుకోవాలి
నర్వ: సులభంగా అర్థమయ్యేలా వినూత్న బోధనతో విద్యార్థులను ఆకట్టుకోవాలని ఏఎంఓ విద్యాసాగర్ సూచించారు. గురువారం మండలంలోని పెద్దకడ్మూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బయోసైన్స్‌పై విద్యార్థులు ఆసక్తికనబర్చేలా బోధనను కృత్యాలతో చేసి చూపించాలన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు పాఠశాలల్లో సైన్స్‌పై కృత్యాలను విద్యార్థులతో చేయించేలా ప్రోత్సహించాలన్నారు. పదోతరగతి విద్యార్థులు ఇప్పటి నుంచే ఓ లక్ష్యంతో చదివేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు భానుప్రకాష్, శ్రీనివాసులు, కాంప్లెక్స్ జీహెచ్‌ఎం భాగ్యలక్ష్మి, సీఆర్పీ నర్సింహులు, సైన్స్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం