
పేదల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం
మక్తల్: రాష్ట్రంలోని పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పట్టణంలోని బాబూ జగ్జీవన్‌కాలనీ, బీసీకాలనీల్లో ఏళ్లుగా పాఠశాలలు లేకపోవడంతో మంత్రి ప్రత్యేక చొరవతో కొత్తగా మంజూరు చేయించి గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆయా కాలనీల్లో ఏళ్లు పాఠశాలలు లేకపోవడంతో విద్యార్థులు చాలా నష్టపోయారని.. సమస్య తన దృష్టికి రావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి మంజూరు చేయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించనున్నామని.. దండు గ్రామానికి చెందిన 9 మంది రైతులు పాఠశాల నిర్మాణానికి భూమి ఇచ్చారని, ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.833.50 కోట్లు మంజూరయ్యాయని, ఏడాదిలో పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.15.13 కోట్లు మంజూరుకాగా పనులు పూర్తి చేసినట్లు వివరించారు. అంతకుముందు విద్యార్థులకు పలుకలు పంపిణీ చేశారు. ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను కాలనీవాసులు మంత్రికి వివరించగా.. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం జీఓనంబర్ 317 రద్దు చేసి సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్, జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ హన్మంతు, ఎంఈఓ అనిల్‌గౌడ్, మాజీ ఎంపీటీసీలు కోళ్ల వెంకటేశ్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, అనంద్‌గౌడ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూర్యచంద్ర, హైమావతి, పరందారాములు, నాగరాజు, మారెప్ప, నారాయణ, గోవర్ధన్, నీలప్ప, దండు రాము, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి