
అత్తాకోడళ్లవి వెన్నుపోటు రాజకీయాలు
నారాయణపేట/ధన్వాడ: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీలో వెన్నుపోటు రాజకీయాలు చేశారని ఇటీవల పాలమూరులో జరిగిన సభలో ఎంపీ డీకే అరుణ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోడలు పర్ణికారెడ్డి గెలుపునకు ఎంపీ తెర వెనుక మద్దతు తెలుపారని.. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో అత్త ఎంపీ డీకే అరుణకు తెర వెనుక మద్దతు తెలిపి కాంగ్రెస్‌పార్టీ ఎంపీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచిందెవరో నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అత్తాకోడళ్లు సొంత ఊరు ధన్వాడ అని చెప్పుకొంటున్నారని.. ఏడాదిన్నరలో ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మంత్రులు పంచాయతీ ఎన్నికలపై తలోమాట మాట్లాడుతూ కాలం వెళ్లదీస్తున్నారే తప్పా నిర్వహణకు ముందుకు రావడం లేదన్నారు. ధన్వాడ పెద్ద చెరువులో ఒండ్రుమట్టి తరలింపు నీరు నింపేందుకా లేక జేబులు నింపుకొనేందుకా అని ప్రశ్నించారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలను పక్కనబెట్టి స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థులే గెలుపొందేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులే ఉన్నారని.. కష్టపడితే ఊరూరా గులాబీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కావలి భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ కో–ఆప్షన్ సభ్యుడు వాహిద్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, యువజన సంఘం అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి, దామోదర్‌రెడ్డి, నాయకులు మురళీధర్‌రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు,
మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి