
ఎమ్మెల్సీ కవిత మాటలు బాధ్యతా రాహిత్యం
నారాయణపేట: పేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని, ఈ ప్రాంత రైతుల ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు మానుకోవాలని మార్కెట్ చైర్మన్ శివారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీవీఆర్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రం సాధించామని చెప్పే బీఆర్‌ఎస్ నాయకులు నేడు కానుకుర్తికి వచ్చి ప్రాజెక్టుపై రైతులను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేశారని, ఇది చాలా బాధాకరమన్నారు. ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత మేధావులు, రైతులు, అన్నివర్గాల ప్రజలు ఏళ్ల తరబడి పోరాటం చేశారని, నిర్మాణం పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లోని లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుందని.. ఊట్కూర్, పేరపళ్ల జాయ మ్మ చెరువు, కానుకుర్తి రిజర్వాయర్ల ద్వారా చెరువులు నింపే పథకమన్నారు. బాధితులకు చరిత్రలో ఎప్పుడూ లేనంత వేగంగా నష్ట పరిహారం అందిస్తారని.. ఎవరూ బలవంతంగా భూములు ఇవ్వడం లేదని, కోర్టు మార్గం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై అవగాహన లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ అమాయక రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. పాలమూరు–రంగారెడ్డి ద్వారా కాల్వల నిర్మాణం చేయకుండానే నీళ్లు ఇస్తామంటూ మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి రైతులను మోసం చేస్తే ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నేతృత్వంలో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, దామరగిద్ద మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఈదప్ప, ఎండీ గౌస్, శ్రీనివాస్, శరణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.