ఆర్టీసీ అభివృద్ధికి కృషి
నారాయణపేట రూరల్: ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. నారాయణపేట డిపోకు మంజూరైన రెండు పల్లె వెలుగు, ఒక ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి పథకం మహిళల కోసం ఆర్టీసీతోనే ప్రారంభించామని గుర్తు చేశారు. బస్సులలో పురుషులకు కొంత ఇబ్బంది అయినా ఇటు ఆడవాళ్ల ఆర్థిక అభివృద్ధికి, ఆర్టీసీ ముందడుగుకు ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. స్థానిక డిపోలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకురాగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో బస్సులు వెళ్లని గ్రామాలకు సైతం పల్లె వెలుగులను పంపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టమని అన్నారు. మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చిందని, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఎంతోమంది ఉద్యోగులు, వ్యాపారులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేయడంతో పాటు మౌలిక సదుపాయాలు, ఉచిత టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు. వివాహాది శుభకార్యాలకు అద్దెకు తీసుకునే బస్సులకు సైతం ధరను తగ్గించి సౌకర్యవంతంగా చేశామని, గమ్యం యాప్‌తో బస్సుల స్థానాన్ని తెలుసుకోవడం, కార్గో సర్వీసుల ద్వారా వస్తువుల రవాణా, డోర్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్య చదువుకునే బాలికలకు సైతం రాయితీ పాసులు కాకుండా ఉచిత రవాణా అందించి విద్యాభివృద్ధికి పరోక్షంగా తోడ్పాటున అందించామన్నారు. ఇటు పుణ్యక్షేత్రాలకు భక్తులను, అటు ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్లడానికి ఉచిత బస్సు ఎంతో ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో డిఎం లావణ్య, సీఐ అలివేలమ్మ, ఎంఎఫ్ చంద్ర నాయక్, ట్రాఫిక్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
ప్రోటోకాల్‌పై రగడ..
ఆర్టీసీలో నూతన బస్సుల ప్రారంభోత్సవానికి ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ పై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటో లేకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఓ సభ్యుడు పోషల్ రాజేష్, మాజీ మార్కె ట్ కమిటీ చైర్మన్ బండి వేణు ఆధ్వర్యంలో ప లువురు కాంగ్రెస్ నాయకులు డీఎం చాంబర్లో వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే పట్ల దురుసుగా మాట్లాడినట్టు సమాచారం ఉందని ప్రశ్నించారు. దీనిపై డియం స్పందిస్తూ మంత్రి ఫొటో విషయంలో మరోసారి అలా జరగకుండా చూస్తామని, ఎమ్మెల్యే విషయంలో తాను ఎలాంటి దురుసు మాటలు అనలేదని, అలాంటిది ఏమైనా ఆధారాలు ఉంటే క్షమించమని కోరుతానని, సరిదిద్దుకుంటానని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.


