ఊరూరా ఉగాది వేడుకలు
కోస్గి: తెలుగువారి నూతన సంవత్సర ఉగాది వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించారు. తొలి పండుగ కావడంతో ఇళ్లకు మామిడి తోరణాలు కట్టి, షడ్రుచులతో తయారు చేసిన పచ్చడిని పంపిణీ చేస్తూ ఒకరికిఒకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారంలో భాగంగా ఉగాది రోజున రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఇళ్లలో పిండివంటలు చేసి గ్రామ దేవతలకు నైవేధ్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాలతోపాటు కోస్గిలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర శివసాయి అయ్యప్ప ఆలయాల్లో శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పంచాంగ శ్రవణం
నూతన సంవత్సరం సందర్భంగా పలు గ్రామాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోస్గిలో వైధిక తసోనిధి జ్యోతిష్యరత్న రుద్రాక్షాల మఠం అమరలింగ స్వామి, చెన్నారంలో విశ్వనాథ స్వామి ఆధ్వర్యంలోనూ ఏర్పాటు చేసిన పంచాగ శ్రవణ కార్యక్రమంలో ఈ ఏడాది రాజకీయాలు, సామాజిక అంశాలు, ఆర్ధిక వ్యవస్థ, వ్యవసాయం, వ్యాపారం, వర్షాలు, ప్రకృతి వైపరిత్యాలను పురోహితులు వివరించారు. పేర్ల ఆధారంగా 12 రాశుల వారి ప్రత్యేక ఫలితాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన, చేయకూడని పనులను, ఆదాయ, వ్యయాలను శాస్త్రోక్తంగా వివరించారు. నవ నాయకుల ఫలితాలు, వాటి ప్రభావం తెలియజేశారు. కోస్గిలని కర్ణకోట ఆంజనేయ స్వామి ఆలయ దగ్గర హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పచ్చడి వితరణ కార్యక్రమం చేపట్టారు. ఇదే క్రమంలో గుండుమాల్, బిజ్జారం, హన్మాన్‌పల్లి గ్రామాల్లో యువకులు పచ్చడి వితరణ చేశారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. పంచాంగ శ్రవణాలు
పొలం పనులకు శ్రీకారం చుట్టిన రైతులు
ఊరూరా ఉగాది వేడుకలు


