కోవెలకుంట్ల: మేజర్ గ్రామపంచాయతీ అయిన కోవెలకుంట్లలో ఆదివారం నిర్వహించిన పోలింగ్ అభాసుపాలైంది. టీడీపీ నాయకులు బీభత్సం చేయడంతో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. వైఎస్సార్‌సీపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయా పోలింగ్ బూత్‌ల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు గెంటివేశారు. ఇతర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన టీడీపీ శ్రేణులు పోలింగ్ బూత్‌లను ఆధీనంలోకి తీసుకుని పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. కోవెలకుంట్ల పట్టణంలోని రంగరాజుపేట, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, మెయిన్‌స్కూల్, బాలికోన్నత, స్పెషల్‌స్కూల్, సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాలల్లో ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పట్టణంలోని ఆయా వార్డులకు చెందిన ఓటర్లు ఉదయాన్నే ఓట్లు వేసేందుకు బారులు తీరారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు ఓట్లు పోల్ అవుతున్నాయని టీడీపీ నేతలు గమనించారు. యనకండ్ల, బనగానపల్లె, గుళ్లదూర్తి, రేవనూరు, గుంజలపాడు, కంపమల్ల, అవుకు, సంజామల, తదితర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో టీడీపీ గూండాలను రప్పించారు. దీంతో పోలింగ్ పరిస్థితులు తారుమారయ్యాయి.
పోలీస్‌స్టేషన్‌కు వైఎస్సార్‌సీపీ నాయకుల తరలింపు
ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు, బీవీ నాగార్జునరెడ్డి, రైతు సంఘం నాయకుడు కానాల రవీంద్రనాథరెడ్డి, పార్టీ నాయకులు నాట్ల పాండురంగారెడ్డి, సహదేవరెడ్డి, మండలంలోని వెలగటూరు మాజీ సర్పంచ్ ఎల్వీ సుధాకర్‌రెడ్డి, సౌదరదిన్నె మాజీ సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, కలుగొట్లకు చెందిన రాంభూపాల్‌రెడ్డి, లింగాల నాయకులు యేర్వశేషిరెడ్డి, బ్రహ్మానందరెడ్డితోపాటు పలువుర్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే వైఎస్సార్‌సీపీ వార్డు అభ్యర్థులు పేరా ప్రసాదరెడ్డి, నాగరాజు, వైఎస్సార్‌సీపీ ఎన్నికల ఏజెంట్లు దండు మధుబాబు, శ్రీనివాసనాయక్, సరోజ, రఘు, రంగ, సునీల్, అరదేశి సుబ్బరాయుడు, వంశీ, నరసింహుడు, నాగరాజు, తదితరులను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు గెంటివేశారు.
పోలింగ్ కేంద్రాలను ఆధీనంలోకి
తీసుకున్న టీడీపీ నాయకులు
వైఎస్సార్‌సీపీ నాయకులు, పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లో లేకుండా చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు ఆయా బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఓట్లు వేయని వారిని గుర్తించి దొంగ ఓట్ల రూపంలో రిగ్గింగ్ చేసుకున్నారు. మొదట రంగరాజుపేటలోని పోలింగ్‌బూత్‌లో పచ్చమూకలు రీసైక్లింగ్ చేస్తుండంతో పోలింగ్ ఏజెంట్లు అడ్డుచెప్పారు. ఈ క్రమంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పోలింగ్ కేంద్రంలో ఉన్న వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులను బయటకు పంపివేయడంతో సమస్య సద్దుమణిగింది. సెయింట్ జోసఫ్స్ పోలింగ్ కేంద్రంలోని 19, 20 బూత్‌ల్లోకి టీడీపీ శ్రేణులు ప్రవేశించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అలాగే జిల్లా పరిషత్ బాలికోన్నత, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల్లోని పోలింగ్ బూత్‌ల్లో టీడీపీ నాయకులు సైక్లింగ్ ద్వారా పెద్ద ఎత్తున దొంగఓట్లు వేశారు. ఆయాపోలింగ్ కేంద్రాల్లో దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల పాటు దొంగ ఓట్లు నమోదు అయినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల ప్రేక్షకపాత్ర
కోవెలకుంట్ల 18వ బూత్‌లో టీడీపీకి వంద ఓట్లు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై ఒత్తిడి తెచ్చి వారి ముందరే వంద దొంగ ఓట్లు వేశారు. అంతటితో ఆగక మిగిలిన ఓట్లు వేసుకుంటామని చెప్పడంతో ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపివేసి తమ పనిని సులువుగా చేసుకున్నారు. ఆయా పోలింగ్‌బూత్‌ల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల వ్యవహారం నడుస్తున్నా అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కొత్త వ్యక్తులను పోలింగ్ బూత్‌ల్లో నుంచి బయటకు పంపివేయాలని పట్టణానికి చెందిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు నిరసనకు దిగడంతో పోలీసులు కొత్త వ్యక్తులను బయటకు పంపివేశారు.
ఓడిపోతామనే భయంతోనే రిగ్గింగ్...
పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తున్నారని ఇదే కొనసాగితే ఎన్నికల్లో ఓటమి తప్పదని భయపడి టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆ పార్టీ వాణిజ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిక్కేపల్లి ప్రసాదరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దండు మధుబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా మొదటి రెండు గంటల ఓటింగ్ సరళిని గమనించిన టీడీపీ నాయకులకు దడ పుట్టిందన్నారు. ఎన్నికల ముందు రోజు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసి కూడా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించలేకపోయారని విమర్శించారు. పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపివేసి పెద్ద ఎత్తున దొంగఓట్లు వేసుకున్నారన్నారు.


