● అశ్రునయాల మధ్య బైరి నాగలక్ష్మీ
అంత్యక్రియలు
ఆళ్లగడ్డ: అధికారం అండతో ‘పచ్చ’రౌడీలు చేసిన దాడి ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో తీరని చీకట్లు నింపింది. కన్నబిడ్డల భవిష్యత్తు కోసం కలలు కన్న ఆ తల్లి.. రాకీయ కక్షలకు బలై విగతజీవిగా మారింది. అహోబిలం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అఖిలప్రియ చేసిన దౌర్జ్యనం, ఆమె అనుచరులు చేసిన దాడుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కోలుకోలేక వైఎస్సార్సీపీ కార్యకర్త బైరి నాగలక్ష్మీ మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం అహోబిలంలో అశ్రునయాల మధ్య ముగిశాయి.
పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే
మృతురాలి చావును సైతం పోలీసులు రాజకీయాలకు వాడుకునే క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి బైరి నాగలక్ష్మీ మృతదేహాన్ని అహోబిలం తీసుకువచ్చారు. ‘అమ్మా.. మమ్ములను విడిచి వెళ్లి పోయావా’ అంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించడం చూపరులను కంట తడిపెట్టించింది. ఈ విషాద సమయంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆ కుటుంబానికి పెద్దదిక్కులా నిలిచారు. కుటుంబ సభ్యుడిగా నిలిచి నివాళులర్పించడమే కాకుండా స్వయంగా పాడెను మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
బాధితులకు భరోసా ..
అహోబిలం గ్రామంలోని బాధిత ఎస్టీ కాలనీలో గంగుల బిజేంద్రారెడ్డి పర్యటించారు. దాడులకు గురై తీవ్రంగా గాయపడ్డ వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, టీడీపీ నేతల అక్రమ కేసులతో బాధితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇళ్ల దగ్గర బిక్కుబిక్కుమంటున్న వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలతో గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడారు. అండగా ఉంటాం.. అధైర్యపడవద్దు అంటూ వారికి భరోసా కల్పించారు. ఘటన తీరును, దాడికి సంబంధించిన దృశ్యాలను బాధితులు మొబైల్ ఫోన్ల ద్వారా మాజీ ఎమ్మెల్యేకు వివరించారు.
చలించిన మాజీ సీఎం వైఎస్ జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేసి నాగలక్ష్మీ మరణవార్తను మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు. పేద గిరిజన మహిళా కార్యకర్త మృతి పట్ల వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆదేశించారు. త్వరలో తాను స్వయంగా అహోబిలం ఘటనలో బాధితులైన అందరినీ కలిసి పరామర్శిస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని బిజేంద్రారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.
ఆర్థిక సాయం
ఘటనలో మృతి చెందిన బైరి గానలక్ష్మీ కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 5 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికీ రూ. లక్ష చొప్పున ఆర్థికసాయాన్ని వైఎస్సార్సీపీ నాయ కులు అందించారు. దాడిలో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వైద్య ఖర్చు లు, కేసులకు సంబంధించి కోర్టు ఖర్చుల మొత్తాన్ని పార్టీ తరుపునే భరిస్తున్నామని గంగుల బిజేంద్రారెడ్డి హామీ ఇచ్చారు.


