● కత్తులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను
నరికిన టీడీపీ గూండాలు
ఆళ్లగడ్డ: ప్రశాంతంగా ఉండే పల్లెల్లో టీడీపీ నాయకులు రాక్షసులుగా మారారు. మారణాయుధాలతో హత్యలకు పాల్పడుతున్నారు. రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెంకటస్వామి శుక్రవారం రాత్రి ఇంటిదగ్గర ఉండగా అదే గ్రామానికి చెందిపన టీడీపీ వర్గీయులు కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో వెంకటస్వామి కుప్ప కూలారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆళ్లగడ్డ వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆయన మృత్యువుతో పోరాడుతున్నారు.
భయం నీడలో ముత్తలూరు
ప్రశాంతతకు మారుపేరైన ముత్తలూరు గ్రామంలో ఎన్నడూ ఈ విధంగా కత్తులు, కర్రలతో దాడులు జరగలేదు. ఏదైనా చిన్నచిన్న గొడవలు జరిగినా వెంటనే ఒకటి రెండు రోజుల్లో మళ్లీ కలిసి మాట్లాడుకోవడం అక్కడ పరిపాటి. అలాంటిది ఫ్యాక్షన్ గ్రామాల మాదిరిగా కత్తులు చేతపట్టుకుని టీడీపీ నాయకులు వీధుల్లో హల్‌చల్ చేస్తూ దాడులకు తెగబడటంతో గ్రామస్తులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెనెలకొంది. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి నంద్యాల వైద్యశాలలో చికిత్స పొందుతున్న వెంకటస్వామిని పరామర్శించారు. దైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు.


