జిల్లాల వారీగా
ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పత్తి
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సదుపాయం తప్పనిసరి. అప్పుడే గిట్టుబాటు ధరలు లభిస్తాయి. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏర్పాట్లు లేవు. దళారుల బారిన పడి రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించకుండా చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్ పేరుతో ప్రాజెక్టును సిద్ధం చేసింది. మొత్తం 10 జిల్లాల్లో సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఈ ఏడాది మే 19న ఈ మేరకు జీవో ఆర్టీ నంబరు 415 జారీ చేసింది. ప్రత్యేక క్టస్లర్లు ఏర్పాటు చేసి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం, ఉత్పాదకతను పెంచడం ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. ఆక్టోబరు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లిలో ప్రారంభించనున్నారు. మార్కెటింగ్ సదుపాయం కల్పించకుండా ఉద్యాన పంటల సాగును ఎంత ప్రోత్సహించినా..ఉత్పాదకత ఎంత పెంచినా ఉపయోగం లేదని రైతులు పేర్కొంటున్నారు.
మార్కెటింగ్ సౌకర్యం ఏదీ?
ఉమ్మడి కర్నూలులో జిల్లాలో ఏటా 37,68,805 టన్నుల ఉద్యాన పంటల ఉత్పాదకత ఉంది. ఇంత భారీగా ఉత్పాదకత ఉన్నప్పటికీ మార్కెటింగ్ సదుపాయం లేదు. ఫలితంగా హైదరాబాద్, బెంగళూరు, చైన్నెవంటి నగరాలకు ఉద్యాన పంటలను తీసుకెళ్లే దళారులను రైతులు ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం పూలు, టమాట, పండ్లకు అక్కడక్కడ ప్రైవేటు మార్కెట్‌లు ఉన్నాయి. అక్కడ వారు ఇచ్చిందే ధరగా లభిస్తోంది. జిల్లాలోని వివిధప్రాంతాల్లో మల్లెలు, గులాబీలు, చామంతులు ఉత్పత్తి అవుతున్నాయి. దళారులకు అప్పగిస్తుండటంతో రైతు కష్టానికి తగిన ప్రతిఫలం అందడం లేదు. టమాట పరిస్థితి అంతే. ఫ్రూట్స్ మార్కెట్‌లో దళారులదే రాజ్యం. కర్నూలులోని గడియారం ఆసుపత్రి దగ్గర ప్రైవేట్ ఫ్రూట్స్ మార్కెట్ ఉంది. ఈ మార్కెట్‌లో రైతులకు న్యాయం జరగడం లేదు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఫ్రూట్స్ మార్కెట్‌ను అభివృద్ధి చేయాల్సిన ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.
సాగునీరు వచ్చేనా?
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌లో భాగంగా నీటిపారుదల కోసం రూ.2,019 కోట్ల ఖర్చు చేయనున్నారు. వేదావతి లిప్ట్ ఇరిగేషన్ కింద హగరి నది నుంచి 8.292 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 80 వేల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. గాజులదిన్నె ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని 4.50 టీఎంసీల నుంచి 5.50 టీఎంసీలకు పెంచడం, 110 చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధి చేయడం లక్ష్యంగా తీసుకున్నారు. ఇందుకోసం రూ.2,019 కోట్లు ఖర్చు పెట్టే విధంగా ప్రణాళికలు ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమాలు కార్యరూపం దాల్చడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు, విభజిత రాష్ట్రానికి ఏడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా.. ఒక్కటి ప్రాజెక్టు కూడా సాకారం కాలేదు. ఇతర ముఖ్యమంత్రులు చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు తెలిసినట్లు మరెవరికి తెలియదు.
మాకు వంద ఎకరాలకుపైగా పండ్లతోటలు ఉన్నాయి. మామిడి, జామ, దానిమ్మ, అంజూర, బొప్పాయి తదితర పండ్లతోటలు ఉన్నాయి. ఏటా అన్ని పంటలు కలిపి 1,500 టన్నులకుపైగా ఉత్పత్తి అవుతాయి. మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. దళారులు పొలం దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తారు. కర్నూలులో ఫ్రూట్స్ మార్కెట్ ఉంటే వ్యాపారుల మధ్య పోటీ ఉంటుంది. ఇది రైతులకు ఉపయోగపడుతుంది.
– జి.శ్రీరాములు, గూడూరు
‘హబ్’లోకి ప్రైవేట్ వ్యక్తులు!
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత సూక్ష్మ సేద్యం పరికరాలు సరఫరా చేసే కంపెనీలకు రూ.కోట్లలో బకాయిలు ఉన్నాయి. ఎంఐడీహెచ్, ఇతర ఉద్యాన పథకాల కింద ఉద్యాన పంటలు సాగు చేసుకున్న రైతులకు రాయితీలు విడుదల చేయడం లేదు. రెండున్నరేళ్ల కాలంలో సబ్సిడీపై కూరగాయల విత్తనాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. అనేక కాంపోనెంట్ల కింద నిధుల విడుదల పెండింగ్‌లో ఉండి పోయింది. వచ్చే మూడేళ్లలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద రూ.2,628 కోట్లు ఖర్చు చేస్తామని హడావుడి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు పథకాల నిధులను దీనికి మళ్లించే విధంగా ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. అంతేగాకుండా ప్రయివేటు పెట్టుబడుల భాగస్వామ్యం ద్వారా గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ఫలితంగా ఉద్యాన పంటల అభివృద్ధిలో ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశించనున్నారు.
జిల్లా విస్తీర్ణం ఉత్పత్తి
హెక్టార్లు టన్నులు
కర్నూలు 86,343 19,32,625
నంద్యాల 49,050 18,36,180
కనిపించని మార్కెటింగ్ సదుపాయం
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటూ
హడావుడి
ప్రైవేట్ పెట్టుబడులకు తెరిచిన ద్వారాలు
రైతులకు ప్రయోజనం శూన్యం
అభివృద్ధి సాధ్యమేనా?
గ్లోబల్ హార్ట్టికల్చర్ హబ్‌లో భాగంగా ఉమ్మడి జిల్లాలో రూ.2,628 కోట్లతో ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైంది. రాబోయే మూడేళ్లలో ఉద్యాన పంటలను ప్రోత్సహించడం కోసం కర్నూలు జిల్లాలో 21 క్లస్టర్లు, నంద్యాల జిల్లాలో 15 క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో రూ.1,642 కోట్లతో వచ్చే మూడేళ్లలో 60 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. నంద్యాల జిల్లాలో రూ.986 కోట్లతో వచ్చే మూడేళ్లలో 45 వేల హెక్టార్లలో ఉద్యాన పంటల అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. ఈ ఏడాది తీవ్ర కరువు నెలకొంది. వచ్చే ఏడాది అదే పరిస్థితి నెలకొంటే ఇదంతా సాధ్యమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి.


