కర్నూలు(అగ్రికల్చర్): సామాజిక భద్రత పింఛన్లకు కేంద్రం వాటా మొత్తం నవంబర్ నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ కానుంది. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లలో కేంద్రం వాటా ఉంది. ఈ మొత్తం ఇక నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ కానుండగా.. మిగిలిన మొత్తం యథావిధిగా నగదు రూపంలోనే అందజేస్తారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లలో కేంద్రం వాటా రూ.200, వికలాంగుల పింఛన్లలో కేంద్రం వాటా రూ.300 ఉంది. మిగిలిన పింఛన్లలో కేంద్రం వాటా లేదు. లబ్ధిదారులకు కేంద్రం వాటా జమ కావాలంటే ప్రతి ఒక్కరికీ ఆధార్ లింకు కలిగిన బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఈ నేపథ్యంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛను పొందుతున్న లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను సరిచూసుకోవాలని డీఆర్‌డీఏ అధికారులు సూచించారు.
ఆలూరు ఎమ్మెల్యే కేసులో తీర్పు రేపటికి రిజర్వ్
ఆదోని: ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిపై అక్రమంగా నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బెయిల్‌కు సంబంధించి ఏపీ హైకోర్టులో మంగళవారం వాదోపవాదాలు ముగిశాయి. తీర్పును గురువారానికి రిజర్వ్ చేశారు. ఎమ్మెల్యే తరపు న్యాయవాదిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయనకు సహాయ, సహకారులుగా వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌సింగ్, లక్ష్మీకాంత్ వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించిన అంశాలపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం వెలువరించే తీర్పుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
కేఎంసీలో డిప్లొమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ డిప్లమో కోర్సులకు ఇంటర్‌మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పూరించిన దరఖాస్తులను ఈ నెల 14వ తేది సాయంత్రం 5 గంటల్లోగా తమ కార్యాలయంలో రూ.100 రుసుము చెల్లించి అందజేయాలన్నారు. పోస్టు ద్వారా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబోమన్నారు. దరఖాస్తులు a psahpc.co.in అనే వెబ్‌సైట్‌లో లభిస్తాయన్నారు. ఈ నెల 23న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని.. బైపీసీ చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు
అగ్రిసెట్ ప్రవేశ ఫలితాల్లో ప్రతిభ
నంద్యాల(అర్బ న్): ఆచార్య ఎన్‌జీరంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించి న అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారని కళాశాల ప్రిన్సిపాల్ జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రతిభ చూపిన విద్యార్థినులను ఆమె అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీఎస్సీ (ఆనర్స్), అగ్రికల్చర్ డిగ్రీ కోర్స్‌లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షలో తమ కళాశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయిలోటాప్–10లో ఇద్దరు, టాప్–100 లో 11 మంది చోటు సంపాదించారన్నారు. బొల్లవరం గ్రామానికి చెందిన చరిత నాల్గవ ర్యాంకు, గొట్లూరు గ్రామానికి చెందిన అంజలి 11వ ర్యాంకులు సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కవిత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
శ్రీశైల ఆలయ సీఎస్‌ఓగా మళ్లీ ఆయనే ?
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థాన ముఖ్య భద్రతా అధికారి (సీఎస్‌వో)గా గతంలో విధుల నుంచి తొలగించిన అధికారినే మళ్లీ తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు అందడంతో సీఎస్‌ఓగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో శ్రీశైలం ఒకటవ పట్టణ సీఐ జీవన్ గంగానాథ్ బాబు, సీఎస్‌వో శ్రీనివాసరావు మధ్య ఫోన్ సంభాషణలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ ఆడియో బయటికి రావడంతో క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించారనే కారణంతో సీఎస్‌ఓను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ శ్రీశైల దేవస్థాన ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొన్ని రోజులుగా ఈఓపై ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు తిరిగి సీఎస్‌ఓగా మళ్లీ ఆయననే విధుల్లోకి తీసుకున్నారు.


