డ్రామాలొద్దు.. ప్రజలు నవ్వుతారు! | - | Sakshi
Sakshi News home page

డ్రామాలొద్దు.. ప్రజలు నవ్వుతారు!

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

● నిజాలు తెలుసుకుని మంత్రి బీసీ మాట్లాడాలి ● షాదీఖానా నిధుల మంజూరు చేయాలని నేను కోరాను ● అడ్డుకున్నానని అబద్ధాలు చెప్పడం సరికాదు ● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

● నిజాలు తెలుసుకుని మంత్రి బీసీ మాట్లాడాలి ● షాదీఖానా నిధుల మంజూరు చేయాలని నేను కోరాను ● అడ్డుకున్నానని అబద్ధాలు చెప్పడం సరికాదు ● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

బనగానపల్లె: బనగానపల్లెలో షాదీఖానా నిర్మాణానికి నిధుల మంజూరులో తాను అడ్డుకున్నట్లు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. మంత్రిగా ఉండి డ్రామాలు ఆడితే ప్రజలు నవ్వుతారని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడారు. బీసీ జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న 2018లోనే షాదీఖానా నిర్మాణానికి జీవో నంబరు 77 ద్వారా కోటి నిధులు మంజూరు చేయించారన్నారు. అందుకు సంబంధించిన మంజూరు ఉత్తర్వులు కూడా వచ్చాయన్నారు. షాదీఖానా నిర్మాణానికి కాంట్రిబ్యూషన్‌ నిధుల కింద అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న బీసీ సొంతగా రూ.30 లక్షలు చెల్లించారన్నారు. నిర్మాణ పనులు రూ.55లక్షల వరకు చేశారన్నారు. అప్పటి ప్రభుత్వం నుంచి కోటి నిధులు మంజూరుకాకపోవడంతో బీసీ సొంతగా కాంట్రిబ్యూషన్‌ కింద చెల్లించిన రూ.30లక్షలు మాత్రమే బిల్లు చేసుకున్నారని కాటసాని పేర్కొన్నారు. ప్రభుత్వం కోటి నిధులు మంజూరు చేయించి ఉంటే రూ.55 లక్షల నిర్మాణ పనులు చేసినవారు రూ.30 లక్షలకు మాత్రమే ఎందుకు బిల్లు చేసుకున్నట్లు ప్రజలకు తెలపాలన్నారు. బిల్లు మంజూరుకాకపోవడంతోనే డ్రా చేసుకోలేకపోయారని, ఆ నిధులు మంజూరుకాకుండా తాను అడ్డుకున్నట్లు ఆరోపణలు చేయడం సబబుకాదని మాజీ ఎమ్మెల్యే కాటసాని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిసి గతంలో తెచ్చిన జీవో 77ను జత చేసి షాదీఖానా నిర్మాణానికి కోటి నిధులు మంజూరు చేయాలని కోరానన్నారు. వక్ఫ్‌బోర్డులో నిధులు లేనందున మంజురుకాలేదన్నారు. షాదీఖానా నిర్మాణానికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు.

మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామ సచివాయాలు, ఆర్‌బీకేలు,హెల్త్‌ సెంటర్లు గ్రామ గ్రామానా ఏర్పాటు చేశామన్నారు. రైతులకు సంబంధించి అక్కంపల్లిలో రూ.25 కోట్లతో, కలుగొట్ల వలంపాడు రూ.7.06 కోట్లతో..ఇలా ఎన్నో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలు నిర్మించామన్నారు. దద్దణాలకు ఎత్తిపోతల పథకం రూ.16 కోట్లతో ఏర్పాటు చేశానని మంత్రి బీసీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బనగానపల్లెలో పేదలకు మంజూరు చేయించిన ప్రభుత్వ స్థలాలను పంపిణీ జరగకుండా బీసీ అడ్డుకున్నారన్నారు. నేడు అదే స్థలాలను పంపిణీ చేసేందుకు మంత్రి ప్రయత్నించడం శోచనీయమన్నారు.

ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి!

షాదీఖానా ముఖద్వారం వద్ద మహనీయలు అబుల్‌కలాం పేరు కాకుండా ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా బీసీజేఆర్‌ అని పేరు ఉంచడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న ఆర్యవైశ్యులు, క్రషర్‌ యజమానులు, పలురకాల చిరు వ్యాపారుల నుంచి బలవంతంగా సీఎస్‌ఆర్‌ పేరుతో నిధులు వసూలు చేసి అభివృద్ధి చేస్తునట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఉర్దూభవన్‌ సమీపంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిరుపేద వ్యాపారులకు దుకాణాల ఏర్పాటుకు పట్టాలు ఇచ్చానన్నారు. బీసీ మంత్రి అయిన వెంటనే వాటిని తొలగించి దుకాణాలు ఏర్పాటు చేసుకున్న ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారన్నారు. అలా ఏర్పాటు చేసిన కాంప్లెక్స్‌ బీసీజేఆర్‌ పేరు పెట్టుకోవడం సబబేనా అని ప్రశ్నించారు. షాపుల నిర్మాణంలో నిధులు తక్కువపడితే ప్రభుత్వం ఇస్తుందని కాటసాని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement