● హత్య కేసులో నలుగురి అరెస్ట్ ● అందరూ అధికార పార్టీకి చెందిన వారే
ఆళ్లగడ్డ: రాజకీయ ఆధిపత్య పోరు చివరకు సొంత పార్టీకి చెందిన నేత దారుణ హత్యకు దారి తీసింది. గ్రామంలో తమ పట్టు కోల్పోకూడదన్న స్వార్థంతో అదే పార్టీ నేత మిద్దె నాగార్జునను అంతమొందించిన ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను గురువారం రూరల్ సీఐ రమణ అరెస్ట్ చూపించారు. వివరాలు.. ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని దేవరాయపురానికి చెందిన మిద్దె నాగార్జున టీడీపీలో చురుగ్గా ఉన్నారు. అదే పార్టీలో ఉన్న కొందరు దీన్ని సహించలేకపోవడంతో వర్గవిభేదాలు నడుస్తున్నాయి. దీనిపై పలుమార్లు ఘర్షణలు జరిగాయి. తమ రాజకీయ ఎదుగుదలకు నాగార్జున అడ్డుగా మారుతున్నాడనే ఉద్దేశంతో నిందితులు పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ నెల 18న తెల్లవారుజామున చింతకుంట నుంచి తాడిపత్రికి బైక్‌పై వెళ్తున్న నాగార్జునను పాంపల్లె, ఉయ్యలవాడ మధ్య పొలాల్లోకి లాక్కెళ్లి దారుణంగా నరికి హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను బట్టి గురువారం ఏ1 బత్తుల రమణ, ఏ4 సజ్జిగాళ్ల ప్రసాద్, ఏ5 కోట ఓబులేసుతో పాటు మరో మైనర్ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి హత్యకు ఉపయోగించిన 3 వేట కొడవళ్లను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని కొందరు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామన్నారు. ఎస్‌ఐ రామిరెడ్డి ఉన్నారు.


