డోన్: అభివృద్ధి పనులకు నయా పైసా తెచ్చే యోగ్యత లేని వ్యక్తి ఏ మొహం పెట్టుకుని ప్రారంభోత్సవాలు చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం డోన్‌లోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఎమ్మెల్యే కోట్ల తన స్థాయిని దిగజార్చుకొని విపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులపై నోరుపారేసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి రాష్ట్ర కేబినెట్ హోదా ఉన్న వ్యక్తి అని, ఆ విషయం ఎమ్మెల్యేకు తెలియకపోవడం శోచనీయమన్నారు. జెడ్పీ, ఎంపీపీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎంపీపీ భవనాన్ని ప్రారంభించేందుకు అనేక మార్లు తేదీలు ఇచ్చినా ఎమ్మెల్యే ఎందుకు వాయిదాలు వేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రారంభించేందుకు తేదీలు ఖరారు చేసిన ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యే కోట్ల బెదిరింపులకు భయపడి జెడ్పీ చైర్మన్‌తో పాటు ప్రజాప్రతినిధులపై ఎలా కేసులు పెడతారన్నారు. ఈ విషయంలో ఎంపీడీఓను త్వరలో కోర్టుకు లాగుతామని బుగ్గన హెచ్చరించారు. విపక్ష పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే లు విరూపాక్షి, బాలనాగిరెడ్డిల ప్రమేయం లేకుండా ప్రారంభోత్సవాలు ఎలా చేస్తున్నారని నిలదీశారు. బేతంచెర్ల నగరపాలక సంస్థకు పైసా కూడా తేకుండా, చైర్మన్ చలంరెడ్డిని పిలవకుండానే భూమి పూజలు, ప్రారంభోత్సవాలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.
అక్రమ కేసులకు భయపడేది లేదు..
వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేసినా భయపడేది లేదని బుగ్గన అన్నారు. చేతనైతే అభివృద్ధి చేయాలే కానీ.. నీచ రాజకీయాలకు పాల్పడం సరికాదన్నారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో టీడీపీకి చెందిన అల్లరి మూకలైన సుదీష్ అనుచరులు ఎంపీడీఓ కార్యాలయం గేటు తాళం పోలీసుల సమక్షంలో పట్టపగలే పగులగొట్టినా కేసు ఎందుకు నమోదు చేయలేదని బుగ్గన ఎమ్మెల్యేను సూటిగా ప్రశ్నించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ రేషన్, మద్యం వ్యాపారాలు చేస్తున్నదెవరని, ఇసుక, అక్రమ మైనింగ్, గంజాయి వ్యాపారాలు కొన సాగిస్తున్నది ఎవరో ఎమ్మెల్యే ప్రజలకు చెప్పాలన్నారు.
చేతనైతే అభివృద్ధి పనులు పూర్తి చేయి..
అర్ధరహిత వ్యాఖ్యలతో రెచ్చగొట్టడం కాకుండా గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని, సిద్ధంగా ఉన్న భవనాలను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే కోట్లకు మాజీ మంత్రి బుగ్గన సవాల్ చేశారు. వాటర్ గ్రిడ్, హంద్రీ నీవా కాలువ నీటి ద్వారా చెరువులను నింపే కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. వెటర్నటీ, బేతంచెర్ల పాలిటెక్నిక్, ఐటీఐ, ఎస్సీ బాలికల ఆశ్రమ పాఠశాల భవనాల టెండర్‌లను ఎందుకు రద్దు చేశారో స్పష్టం చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఐటీడీఆర్ వెంటనే పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలోని మదిలేట్టి స్వామి, గుండాల చెన్నకేశవ స్వామి, కంభగిరిస్వామి, పాలుట్ల రంగస్వామి, ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు రూ.1.50 కోట్లను కార్బస్ ఫండ్‌గా తన సొంత డబ్బును చెల్లించిన విషయాన్ని బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమావేశంలో ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్, మార్కె ట్ యార్ట్ మాజీ చైర్మెన్ రామచంద్రుడు, వలంటీర్ సంఘం జిల్లా అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డి, పార్టీ నాయకులు జాకీర్ హుస్సేన్, సుధాకర్ యాదవ్, మదిలేట్టి, అక్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ప్రోటోకాల్ కూడా తెలియదా?
దిగజారుడు వ్యాఖ్యలు మానుకో
ఎంపీడీఓను కోర్టుకు లాగుతాం
డోన్ ఎమ్మెల్యే కోట్లపై మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం


