పరమేశ్వరుని వరమే!
● ఫృథ్వీ సుబ్బారావు
‘మా కుటుంబ సభ్యులు నాలుగు తరాలుగా మల్లన్న పాగాలంకరణ సేవలో తరిస్తున్నారు. ఇదంతా పరమేశ్వరుని వరమే’ అని ఫృథ్వీ సుబ్బారావు అన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైలం మల్లన్నకు లింగోద్భవకాలంలో జరిగే పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉందని ఆయన చెప్పారు. ‘సాక్షి’తో శనివారం ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లో.. ‘మా ఇంటి పెద్దలు దైవంగా కొలిచే మల్లన్నకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వయంగా నేసిన పాగాను అలంకరించేవారు. మొదట మా ముత్తాతాతయ్య కందస్వామి, ఆ తరువాత మా తాత సుబ్బారావు, మా నాన్న వెంకటేశ్వర్లు పాగాలంకరణ చేశారు. ఇప్పుడు నేను స్వామివారికి పాగాలంకరణ చేస్తున్నాను. మా పూర్వీకుల నుంచి 70ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది.
భక్తిశ్రద్ధలతో నేస్తాం
‘మాది బాపట్ల జిల్లా చీరాల వద్ద హస్తినాపురం. నా భార్య ఫృథ్వి దుర్గ, చెల్లెలు మల్లీశ్వరి అందరం ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉంటున్నాం. స్వామివారికి పాగా ఎంతో భక్తి శ్రద్ధలతో నేస్తాం. గతంలో ప్రతిరోజూ ఒక మూర చొప్పున ఏడాది పాటు 365 రోజులు 365 మూరలు నేసేవారు. ప్రస్తుతం కార్తీకమాసం నుంచి పాగా నేతను ప్రారంభించాం. శివరాత్రికి పది రోజుల ముందే 300 మూరలు పూర్తి చేశాం. పాగాలంకరణ సేవ సందర్భంగా దేవస్థానం మాకు అతిథ్యం ఇస్తుంది. కోట్లాది మంది భక్తులు ఇష్టదైవంగా కొలిచే మల్లికార్జున స్వామికి పాగాలంకరణ చేయడం మేం చేసుకున్న అదృష్టం.’


