మద్యం కిక్కు.. ఆరోగ్యానికి చిక్కు! | - | Sakshi
Sakshi News home page

మద్యం కిక్కు.. ఆరోగ్యానికి చిక్కు!

Jul 30 2025 7:14 AM | Updated on Jul 30 2025 7:14 AM

మద్యం

మద్యం కిక్కు.. ఆరోగ్యానికి చిక్కు!

ఐదేళ్లలో మద్యం బాధితుల వివరాలు

మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది అన్ని మద్యం బాటిళ్లపై రాసి ఉంటుంది. ఇందులో నాణ్యమైన మద్యం, కల్తీ మద్యం అన్న తేడా ఉండదు. ఏ మద్యం తాగినా కాలేయం చెడిపోవడం తథ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే క్రమంగా వ్యాధులకు గురిచేసి ప్రాణాలు తీసే మహమ్మారి ఇది. కూటమి ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా మద్యం దుకాణాలు వెలియడంతో మద్యం తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మందుబాబులు పూటుగా మద్యం తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ కనిపిస్తున్నారు. పలువురు వ్యాధుల బారిన పడి చనిపోతున్నారు. జిల్లాలో మద్యం తాగి మరణించే వారి సంఖ్య ఈ ఏడాది కాలంలో గణనీయంగా పెరగడమే అందుకు నిదర్శనం.

కర్నూలు(హాస్పిటల్‌): వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం తాగడాన్ని కట్టడి చేసేందుకు మద్యం దుకాణాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. ప్రైవేటు దుకాణాలు, బెల్ట్‌షాపులకు చెక్‌ పెట్టింది. కేవలం ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే మద్యం విక్రయించేలా చర్యలు చేపట్టింది. మద్యం ధరలు సైతం షాక్‌ కొట్టేలా చర్యలు తీసుకుంది. ఈ కారణంగా మద్యం తాగే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ కూటమి సర్కారు ఏర్పడ్డాక ప్రైవేటు మద్యం దుకాణాలు మళ్లీ రాజ్యమేలుతున్నాయి. వాటిలో ఎలాంటి మద్యం విక్రయిస్తున్నారో అర్థం గాని పరిస్థితి. ప్రభుత్వం నాణ్యమైన మద్యం అని చెబుతున్నా దానిని తాగిన వారు ఎక్కువ మంది ఆసుపత్రి పాలవుతున్నారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ తూలి, కూలిపోతున్నారు. ఫలితంగా మద్యంకారక వ్యాధులు అధికమయ్యాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జీర్ణకోశవ్యాధుల విభాగం (గ్యాస్ట్రో ఎంట్రాలజి)కు చికిత్స కోసం వచ్చే వారిలో 50 శాతం వరకు ఆల్కహాలు బాధితులే కావడం గమనార్హం. ప్రతిరోజూ, దీర్ఘకాలం అధిక మోతాదులో మద్యం సేవించడం ద్వారా కాలేయం దెబ్బతిని అది క్రమంగా లివర్‌ సిర్రోసిస్‌కు దారి తీస్తోంది. ఒకసారి సిర్రోసిస్‌ వచ్చిందంటే ప్రాణాంతకమై ప్రాణాలు పోయే అవకాశం ఉంది. గతంలో ఆల్కహాలు సేవనం వల్ల లివర్‌సిర్రోసిస్‌కు గురై ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య 20 శాతం కంటే తక్కువగా ఉండేదని, ఇటీవల ఈ సంఖ్య 40 శాతానికి మించిందని వైద్యులు చెబుతున్నారు. వీరితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ప్రతిరోజూ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు మద్యానికి బానిసై వివిధ వ్యాధులకు గురై చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య రోజుకు 200లకు పైగా ఉంటోంది.

మద్యం ఏదైనా ఒళ్లు గుళ్లే...!

మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని అటు బాటిళ్లపై, సినిమాల్లో తారలు మద్యం తాగేసమయంలో వచ్చే హెచ్చరికలు తెలియజేస్తున్నాయి. ఇందులో మంచి మద్యం, చెడు మద్యం అంటూ ఉండవు. ఎలాంటి మద్యం తాగినా ఒళ్లు గుళ్ల కావాల్సిందే. మద్యం తాగడం వల్ల ముందుగా ఫ్యాటీ లివర్‌ వస్తుంది. ఈ స్టేజిలో మద్యం ఆపేసి చికిత్స తీసుకుంటే కాలేయం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌ స్టేజిలోనూ మద్యం సేవనం ఆపేసి చికిత్స తీసుకుంటే 70 శాతం వరకు రోగిని రక్షించుకోవచ్చు. ఆ తర్వాత సిర్రోసిస్‌ వచ్చిందంటే కాపాడుకోవడం కష్టం. ప్రతిరోజూ విస్కీ 90ఎంఎల్‌, వైన్‌ 150ఎంఎల్‌, బీర్‌ 350ఎంఎల్‌ తాగే వారిలోనూ ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాలు కారణంగా ప్యాంక్రియాస్‌ జబ్బులు పెరిగి మెదడు, గుండైపె తీవ్ర ప్రభావం చూపుతోంది.

మద్యపానంతో వచ్చే వ్యాధులు

ఆల్కహాలు సేవించడం వల్ల ముందుగా ఫ్యాటీ లివర్‌, లివర్‌ సిర్రోసిస్‌ వస్తుంది. శరీరంలో కొవ్వు శాతం పెరిగి గుండెజబ్బులకు దారి తీస్తుంది. అధిక రక్తపోటు, నాడీ మండల వ్యాధులకు గురిచేస్తుంది. నరాలు, కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఎక్కువగా నోరు, అన్నవాహిక, గొంతు, లివర్‌, పాంక్రియాస్‌ క్యాన్సర్‌లకూ దారి తీస్తుంది. కడుపులో అల్సర్‌కు దారి తీసి అది ఒక్కోసారి క్యాన్సర్‌గా మారే అవకాశమూ ఉంది. ఆల్కహాలు సేవించడం వల్ల పాంక్రియాస్‌ జబ్బులు కూడా పెరుగుతున్నాయి. అది మెదడు, గుండైపె తీవ్రప్రభావం చూపుతుంది. రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అతిగా మద్యం సేవించే వారు క్రమంగా సమాజం నుంచి దూరమవుతున్నారు. ఇన్ని నష్టాలున్న మద్యాన్ని తాగకపోవడమే మేలని వైద్యులు సూచిస్తున్నారు.

మద్యం తాగి గతేడాది 271 మంది మృతి

ఈ ఏడాది జూన్‌ నాటికి 97 మంది మృత్యువాత

పెద్దాసుపత్రికి వచ్చే రోగుల్లో 50 శాతం మంది మద్యం బాధితులే

ఏటా పెరుగుతున్న కాలేయం, క్లోమ

గ్రంథివ్యాధి కేసులు

వేధిస్తున్న ఫ్యాటీ లివర్‌, హెపటైటిస్‌ జబ్బులు

సంవత్సరం ఓపీ ఐపీ మరణాలు

2021 6,617 1,013 24

2022 8,943 1,449 35

2023 10,051 1,626 60

2024 15,564 3,366 271

2025 8,655 1,561 97

(జూన్‌ వరకు)

మద్యం ఏదైనా ఆరోగ్యానికి హానికరమే

మేము వారానికి ఒకసారి మాత్రమే తాగుతున్నాము. అది కూడా లిమిట్‌గా తాగుతున్నామని కొందరు చెబుతుంటారు. మద్యం ఎంత మోతాదులో తాగినా ప్రమాదమే. అతిగా మద్యం సేవించడం ద్వారా త్వరగా కాలేయం దెబ్బతింటుంది. లివర్‌ సిరోసిస్‌కు గురైన వారిని కాపాడటం కష్టంతో కూడుకున్నపని. మద్యం తాగడం కన్నా దానికి దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది.

–డాక్టర్‌ జి.మోహన్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజి హెచ్‌వోడి, జీజీహెచ్‌, కర్నూలు

ఎక్కువ మందికి ఫ్యాటీ లివర్‌

మద్యపానం వల్ల ఎక్కువ మంది ముందుగా ఫ్యాటీలివర్‌కు గురవుతున్నారు. ఇటీవల ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. మద్యం తాగే సమయంలో కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల కాలేయంపై కొవ్వు పేరుకుంటోంది. ఫ్యాటీలివర్‌ను త్వరగా గుర్తించి చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.

–డాక్టర్‌ పి. అబ్దుల్‌ సమద్‌, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు

మద్యం కిక్కు.. ఆరోగ్యానికి చిక్కు! 1
1/2

మద్యం కిక్కు.. ఆరోగ్యానికి చిక్కు!

మద్యం కిక్కు.. ఆరోగ్యానికి చిక్కు! 2
2/2

మద్యం కిక్కు.. ఆరోగ్యానికి చిక్కు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement