
సంక్షోభంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు
● వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కటికె గౌతమ్
కర్నూలు(అర్బన్): కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ వసతి గృహాలు సంక్షోభంలో కూరుకుపోయాయని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కటికె గౌతమ్ ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నాయకత్వంలో ఈ నెల 28,29,30వ తేదీల్లో సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్‌రెడ్డి సూచన మేరకు నగరంలోని పలు హాస్టళ్లను పరిశీలించామన్నారు. డాక్టర్స్ కాలనీలోని బీసీ కళాశాల బాలుర వసతి గృహం వద్ద వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు మాట్లాడుతూ నగరంలోని పలు సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, కనీసం మరుగుదొడ్లు, నిద్రించేందుకు గదులు, స్నానానికి, తాగేందుకు నీరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. నాడు – నేడు ద్వారా వేల కోట్ల రూపాయలు వెచ్చించి పాఠశాలల రూపురేఖలు మార్చారన్నారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు విద్యార్థుల సమస్యలు, సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి పట్టదన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో సకాలంలో విద్యా దీవెన, వసతి దీవెన, హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు విడుదలయ్యేవన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి హాస్టల్ విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కార్యక్రమంలో బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాఘవేంధ్రనాయుడు, నగర అధ్యక్షుడు స్వాములు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనగర్ వెంకటేష్, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు అన్సూర్‌బాషా, జిల్లా నాయకులు తిరుమలేష్, శ్రీధర్, కోట్ల మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.