
ఎస్సీ, ఎస్టీ మహిళా నర్సులకు ఉచిత శిక్షణ
నంద్యాల(న్యూటౌన్): జర్మనీలో ఉద్యోగాలు పొందేందుకు ఎస్సీ, ఎస్టీ మహిళా నర్సులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నంద్యాల జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, పుత్తూరు, విశాఖపట్నం కేంద్రాల్లో శిక్షణ ఉంటుందని, 35 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణకు దరాఖాస్తులు వచ్చేనెల 7వ తేదీలోగా సమర్పించాలని, మరింత సమాచారం కోసం 8297812530 సెల్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
మహిళ ప్రాణం తీసిన
ఆర్‌ఎంపీ వైద్యం
నందికొట్కూరు: ఆర్‌ఎంపీ వైద్యం ఒక మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ ఏఎస్‌ఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. గడివేముల మండలంలోని గని గ్రామానికి చెందిన శివమ్మ కూమార్తె శ్రీవాణికి ఈ నెల 28వ తేదీన నందికొట్కూరు పట్టణంలోని గీతారాణి ఆర్‌ఎంపీ వద్ద శ్రీవాణి అబార్షన్ చేయించారు. అనంతరం 29వ తేదీన పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి వెళ్లారు. శ్రీవాణికి తీవ్ర రక్తస్రావం కావడంతో 30వ తేదీన బుధవారం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యులు చూసి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. రూరల్ సీఐ సుబ్రమణ్యం సంఘటనపై విచారణ చేపట్టారు.
డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
కోవెలకుంట్ల: వివిధ స్టేజీల్లో ఉన్న పక్కాగృహాలను డిసెంబర్ ఆఖరునాటికి పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ శ్రీహరి గోపాల్ సూచించారు. పట్టణ శివారులోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో హౌసింగ్ సిబ్బంది, గ్రామసచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. జగనన్న కాలనీల్లో బేస్‌మెంట్, లింటల్, తదితర దశల్లో ఇళ్ల ఉన్న నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. బిల్లులు తీసుకుని నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోకపోతే ఆ గృహాలు రద్దు అవుతాయని, భవిష్యత్తులో గృహ నిర్మాణ బిల్లులు అందబోవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వరప్రసాదరావు, హౌసింగ్ డీఈ కృష్ణారెడ్డి, ఏఈ మద్దిలేటి, వర్క్‌ఇన్స్‌పెక్టర్లు గోవిందు, సుబ్బరాయుడు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
రోజంతా సర్వర్ సమస్యే!
● ఫసల్ బీమాకు దూరమైన రైతులు
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు తిలోదకాలు ఇవ్వడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద నోటిఫై చేసిన వివిధ పంటలకు ప్రీమియం చెల్లించేందుకు గురువారం చివరి రోజు కావడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. కంది, జొన్న, సజ్జ తదితర పంటలకు ప్రీమియం చెల్లించేందుకు రైతులు ముందుకొచ్చారు. ప్రీమియం చెల్లించాలంటే రైతు సేవ కేంద్రం నుంచి పంట సాగు చేసినట్లు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంది. అయితే సర్వర్ సమస్యతో రైతులు సర్టిఫికెట్ పొందలేకపోయారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సమస్య ఏర్పడటంతో రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అక్కడక్కడ షోయింగ్ సర్టిఫికెట్ అప్‌లోడ్ అయినప్పటికీ ప్రీమియం చెల్లించేందుకు కూడా సర్వర్ సమస్య తలెత్తింది. సాంకేతిక సమస్యల వల్ల సర్వర్ ప్రాబ్లం వచ్చినట్లు తెలుస్తోంది. పరిష్కారానికి వ్యవసాయ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల రైతులు ఫసల్ బీమా చేయించుకోలేకపోయారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఈ–క్రాప్‌లో నోటిఫైడ్ పంట సాగు చేసినట్లు నమోదైతే చాలు ఉచిత పంటల బీమా వర్తించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు తిలోదకాలు ఇవ్వడం, ప్రీమియం చెల్లించే విధానాన్ని తీసుకురావడంతో రైతులు చుక్కలు చూడాల్సి వస్తోంది.

ఎస్సీ, ఎస్టీ మహిళా నర్సులకు ఉచిత శిక్షణ