
హాస్టళ్లలో నీళ్ల పప్పుతో అన్నం
నంద్యాల: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నీళ్ల పప్పుతో అన్నం పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురేష్‌యాదవ్ అన్నారు. గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారికి వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్ ఎదుట సురేష్‌యాదవ్ విలేకరులతో మాట్లాడారు. గత నాలుగు రోజులుగా సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమం నిర్వహించి సమస్యలు తెలుసుకున్నామన్నారు. చాలా హాస్టళ్లలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, విద్యార్థులు నేలపై నిద్రిస్తున్నారని, నేటికీ దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేయలేదని తెలిపారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మెనూ ప్రకారం ప్రతి రోజూ గుడ్డు, వేరుశనగ చిక్కీ, వారానికి రెండుసార్లు చికెన్ పెట్టడం లేదన్నారు. మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు జశ్వంత్‌రెడ్డి, హరికిరణ్, రియాజ్‌బాషా, అబ్దుల్లా, శషాంక్, హేమంత్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్