
మంత్రి కళ్లలో ఆనందానికా.. రామిరెడ్డికి మంచి పేరొస్తుందన
మినరల్ వాటర్ ప్లాంట్ కూల్చివేత
● భారీ పోలీసు బందోబస్తు మధ్య ఘటన
● సీసీ కెమెరాల నిలిపివేత
● ఫొటోలు, వీడియోలు
తీయకుండా దౌర్జన్యం
సాక్షి టాస్క్‌ఫోర్స్: బనగానపల్లెలో టీడీపీ నేతల అరాచకానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసులతో బెదిరింపులకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేపట్టిన మంచి పనులను టీడీపీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి. ఆ పనులు అలాగే కొనసాగితే ఎక్కడ మంచిపేరు వస్తుందోనని ఏకంగా ఆనవాళ్లు లేకుండా చేసేందుకు సిద్ధపడటాన్ని ప్రజలు ఛీకొడుతున్నారు. ఎంతో మంది ప్రజల దాహార్తి తీరుస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏకంగా కూలదోసిన ఘటన టీడీపీ నేతల నీచ రాజకీయానికి అద్దం పడుతోంది. మంత్రి కళ్లలో ఆనందం చూడటానికి ఇలా చేశారా? లేక మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని జీర్ణించుకోలేక ఇలా దుశ్చర్యకు పాల్పడ్డారా? అని ప్రజల్లో చర్చ జరుగుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బనగానపల్లె పాత బస్టాండ్ సమీపంలో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా పట్టణ ప్రజలేకాకుండా సంతమార్కెట్, పండ్ల మార్కెట్ ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి పండ్లు, కూరగాయలను రాత్రి వేళల్లో మార్కెట్‌కు తీసుకొచ్చేవారికి ఉపయోగకరంగా ఉంది. అర్థరాత్రి అయినప్పటికీ ఈ ఫ్లాంట్ ద్వారా పట్టణ ప్రజలు, వ్యాపారులకు తాగునీరు లభిస్తోంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, ఆ వాటర్ ప్లాంట్‌ను అలాగే కొనసాగిస్తే ఎక్కడ రామిరెడ్డికి మంచి పేరు వస్తుందోనని స్థానిక టీడీపీ నేతలు భావించినట్లు తెలుస్తోంది.
భారీ బందోబస్తు మధ్య కూల్చివేత
పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న వాటర్‌ప్లాంట్ కూల్చివేత వెనుక మంత్రి బీసీ హస్తం ఉన్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతోంది. ఆయనకు తెలియకుండా అధికారులు కూడా ఇంతటి సాహసం చేయలేరని తెలుస్తోంది. ప్లాంట్ మిషనరీని మరోచోటుకు తరలించి గురువారం జేసీబీ సాయంతో ప్లాంట్ భవనాన్ని కూల్చివేశారు. ఆ సమయంలో అక్కడి సీసీ కెమెరాలను సైతం పనిచేయకుండా చేశారు. ఒక వ్యక్తి రహస్యంగా వీడియో తీస్తుండటంతో గమనించిన టీడీపీ శ్రేణులు సెల్‌ఫోన్ లాక్కొని పగులగొట్టినట్లు తెలిసింది. అధికారం అండతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేత చేపట్టడం గమనార్హం.

మంత్రి కళ్లలో ఆనందానికా.. రామిరెడ్డికి మంచి పేరొస్తుందన