
మూడు మండలాల్లో అడుగంటిన భూగర్భ జలాలు
నంద్యాల: వర్షాభావ పరిస్థితులతో ఫ్యాపిలి, డోన్, కొలిమిగుండ్ల మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని, నీటి సంరక్షణ చర్యలు విస్తృతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టర్ చాంబర్‌లో వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్యాపిలిలో 24.23, డోన్‌లో 23.46, కొలిమిగుండ్లలో 26.67 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వెళ్లాయన్నారు. జిల్లాలో భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకొని 16 మండలాలలో మైక్రో వాటర్ షెడ్ల ప్రోగ్రాంల కోసం 18 ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాకు 3,500 మెట్రిక్ టన్నుల యూరియా ఆగస్టు1న (శుక్రవారం) రానున్నట్లు తెలిపారు. ఇవేకాక ఇప్పటికే జిల్లాలో అదనంగా మరొక 1100 మెట్రిక్ టన్నుల యూరియా లభ్యత ఉందన్నారు. ప్రతి రైతు ఈ పంట నమోదుతో పాటు పంటల బీమా కూడా చేసుకోవాలన్నారు. జిల్లాలోని ఆయకట్టును అభివృద్ధి చేయడానికి 91 పనులను ప్రతిపాదించామన్నారు. ఈ పనులకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం ఖర్చును భరిస్తాయన్నారు. ఇవే కాక రెండవ దశలో మరొక 19 పనులను రూ.16 కోట్లతో ప్రతిపాదించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో వ్యవసాయ, జల వనరుల శాఖ, డ్వామా, భూగర్భ జలాలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.