
జర్మన్ భాషలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారిణి చింతామణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని మూడు కేంద్రాల్లో 150 మందికి జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలకు 75, షెడ్యూల్ తెగలకు 75 సీట్ల చొప్పున 8 నుంచి 10 నెలల పాటు జర్మనీ భాషపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి ప్రధాన కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. మహిళా అభ్యర్థులు విద్యార్హత పత్రాలను dscw.eonandyal@gmail. com కు మెయిల్ చేయాలన్నారు.
వీబీఆర్‌లో 14 టీఎంసీల నీరు
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్)లో 14.929 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వీబీఆర్‌కు 13,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. వీబీఆర్ నుంచి దిగువకు 1,3705 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ శివనాయక్ తెలిపారు.
ఎన్‌పీసీఐ ఖాతాల మ్యాపింగ్ తప్పనిసరి
నంద్యాల: అన్నదాత సుఖీభవ లబ్ధి కోసం ఇన్ యాక్టివ్ ఉన్న రైతుల ఎన్‌పీసీఐ ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అన్నదాత సుఖీభవ, యూరియా లభ్యత అంశాలపై రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 2.07 లక్షల మంది రైతులకు ఉన్నారని, అందులో 1.97 లక్షల మందికి ఈకేవైసీ, ఎన్‌పీసీఐ ఖాతాలు మ్యాపింగ్ చేశారని తెలిపారు. మిగతా రైతులకు కూడా వెంటనే ఈకేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, వాటిని అవసరం మేరకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో జేసీ విష్ణు చరణ్, ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, మార్క్‌ఫెడ్, డీఎల్‌డీఎం సంబంధిత మండలాధికారులు పాల్గొన్నారు.
శ్రీశైల ముఖద్వారం
సమీపంలో ఎలుగుబంటి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన ముఖద్వారం సమీపంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. దీనిని బస్సులో నుంచి కొందరు ప్రయాణికులు చూశారు. తరచూ ముఖద్వారం వద్ద, శిఖరేశ్వరం వద్ద ఎలుగుబంటి సంచారం కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. దీంతో ద్విచక్రవాహనదారులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాల్సి ఉంది.
తిరుపతి రైలుకు
కోవెలకుంట్లలో స్టాపింగ్
కోవెలకుంట్ల: నంద్యాల– యర్రగుంట్ల రైల్వే మార్గంలో ప్రతి రోజు నడుస్తున్న గుంటూరు– తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రెండు స్టేషన్లలో స్టాపింగ్‌కు అనుమతిని ఇస్తూ దక్షణ మధ్య రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కోవెలకుంట్ల, జమ్మలమడుగు స్టేషన్లలో నెల రోజుల నుంచి స్టాపింగ్‌ను రద్దు చేశారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నెల రోజుల నుంచి ఆయా స్టేషన్లలో తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నారు. ప్రయాణీకుల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిరిగి రైల్వేశాఖ ఆగస్టు 2వ తేదీ నుంచి ఆరు నెలల పాటు రెండు స్టేషన్లలో స్టాపింగ్‌కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవెలకుంట్ల మండలంతోపాటు సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, గోస్పాడు, అవుకు, కొలిమిగుండ్ల మండలాలకు చెందిన ప్రజలు కోవెలకుంట్లకు చేరుకుని తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లవచ్చు.

జర్మన్ భాషలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం