
రక్షిత నీరు.. ‘లెస్’ టెండర్ తీరు
● 40 శాతం లెస్‌కు ఆర్‌డబ్ల్యూఎస్
ఓఅండ్‌ఎం టెండర్లు
● 12 స్కీంలకు తొలగిన అడ్డంకులు
● అగ్రిమెంట్ చేసుకొని పనుల
నిర్వహణను చేపట్టిన కాంట్రాక్టర్లు
● నష్టానికి నీటి సరఫరాపై అనుమానాలు
● చివరి గ్రామాలకు
రక్షిత నీరు ప్రశ్నార్థకమే!
‘అడిషనల్’ డిపాజిట్ ఇవ్వాల్సిందే
మంచి నీటి పథకాల నిర్వహణకు సంబంధించి 25 శాతం వరకు లెస్‌కు టెండర్లు వేసుకునే సౌలభ్యం ఉంది. అయితే 25 శాతం కంటే అధికంగా లెస్‌కు వెళ్తే సంబంధిత కాంట్రాక్టర్ నుంచి అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను చేయించుకుంటాం. అగ్రిమెంట్ చేసుకున్నప్పటి నుంచి ఏడాది పాటు ఆయా స్కీంల నుంచి నిర్ణయించిన గ్రామాలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేయాల్సిందే. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం.
– బీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్
కర్నూలు(అర్బన్): ఎవరైనా వ్యాపారం చేసేది లాభం కోసమే, కానీ జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగంలో మాత్రం నష్టానికి నీళ్ల వ్యాపారం చేస్తున్నారు. అధికారులు నిర్ణయించిన ధర కంటే 40 శాతానికి పైగా లెస్‌కు పనులను దక్కించుకున్నారంటే ఆయా పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకం అవుతోంది. 10 శాతం లెస్‌కు టెండర్లు వేసుకోవడం సహజం. అయితే 25 శాతం వరకు లెస్‌కు వేసుకునేందుకు ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే పలు పథకాలకు ఏకంగా 40 శాతానికి పైగా లెస్‌కు టెండర్లు వేసి అగ్రిమెంట్లు చేసుకున్నారు. ప్రస్తుతానికి పనులు దక్కించుకొని అధికార పార్టీ నేతల అండదండలతో ఏదో ఒక విధంగా మేనేజ్ చేయవచ్చనే ఆలోచనలతోనే కాంట్రాక్టర్లు అధిక శాతం లెస్‌కు వెళ్లి ఉంటారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ల ఆశ్చర్యం
జిల్లాలోని 351 గ్రామాలకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో 33 మంచి నీటి పథకాల ద్వారా రక్షిత మంచి నీటిని అందించాల్సి ఉంది. ఈ స్కీంల నిర్వహణకు ప్రతి ఏటా రూ.49.29 కోట్లు ఖర్చు చేస్తున్నారు. తాగునీటి పథకాల నిర్వహణ, తాత్కాలిక మరమ్మతులు, సిబ్బంది జీతభత్యాలకు ఈ నిధులను వెచ్చించుకునే సౌలభ్యం ఉంది. ఈ పథకాలకు సంబంధించి టెండర్ విధానం ద్వారా కాంట్రాక్టర్లకు పనులను అప్పగిస్తున్నారు. అయితే ఆదోని డివిజన్‌లోని 16 మంచి నీటి పథకాల నిర్వహణకు సంబంధించి పలువురు టెండర్‌కు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందులో 12 రిట్ పిటిషన్లకు సంబంధించి నామినేషన్ పద్ధతిన పనులను అప్పగించరాదని, టెండర్లు నిర్వహించిన వాటికి అగ్రిమెంట్ చేసుకుంటే తాము అడ్డుపడమని న్యాయ స్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 12 స్కీంలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పనులకు సంబంధించి ఒకటి, రెండు మినహా మిగిలిన అన్ని పనులకు 25 శాతానికంటే అధికంగా లెస్‌కు వెళ్లి కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు. 40 శాతం లెస్‌కు పనులు దక్కించుకోవడంపై ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. చివరి వరకు ఆయా స్కీంల నుంచి నిర్దేశించిన గ్రామాలకు రక్షిత నీటిని అందించగలరా? అనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొన్ని గ్రామాలకు రెండు నుంచి నాలుగు రోజులకు ఒకసారి, మరి కొన్ని గ్రామాలకు ఆయా గ్రామాల్లోని సోర్సులను అనుసరించి వారానికి ఒకసారి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఇంజినీర్లే చెప్పడం గమనార్హం.
ఆదోని డివిజన్‌లోని పెసలబండ స్కీం నుంచి 21 గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించాల్సి ఉంది. ఏడాది పాటు ఆయా గ్రామాలకు రక్షిత నీరు అందించేందుకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) కింద రూ.81.21 లక్షలు వ్యయం అవుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అంచనాలు రూపొందించి టెండర్లను ఆహ్వానించారు. అయితే ఓ కాంట్రాక్టర్ 40 శాతం లెస్‌కు ఈ పనులను దక్కించుకున్నారు. పనుల్లో నాణ్యత ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏడాది పాటు చివరి గ్రామాల వరకు రక్షిత తాగునీటిని సరఫరా చేస్తారా? అనే అనుమానాలను ఇంజినీర్లే వ్యక్తం చేస్తున్నారు.
విరుపాపురం స్కీం నుంచి 13 గ్రామాలకు రక్షిత నీటిని అందించేందుకు అంచనా విలువ రూ.21.60 లక్షలు కాగా, ఈ పనులను కూడా 31.76 శాతం లెస్‌కు దక్కించుకున్నారు. అలాగే కుప్పగల్ (40 శాతం), హెబ్బటం (40.15 శాతం), కౌతాళం (40.01 శాతం), సాతనూరు (40.01 శాతం), మండగిరి (40.01 శాతం) ఆస్పరి (35.46 శాతం), అల్వాల (36.90 శాతం), హానవాళు (28.59 శాతం) లెస్‌కు కాంట్రాక్టులను దక్కించుకున్నారు. కాగా.. రూ.114.46 లక్షల అంచనాతో 26 గ్రామాలకు నీరు అందించే బాపురం నీటి పథకం పనులను మాత్రం 23 శాతం లెస్‌కు దక్కించుకున్నారు.

రక్షిత నీరు.. ‘లెస్’ టెండర్ తీరు