ఎర్ర రాళ్ల బావికి పూర్వ వైభవం
రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి పాలనకు గుర్తుగా చారిత్రక కట్టడాలు, బావులు మాత్రం నేటికి దర్శనమిస్తున్నాయి. చారిత్రక వైభవానికి మెట్ల బావులు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నందిపాడు గ్రామ శివార్లలోని చౌడేశ్వరిదేవి ఆలయ ఆవరణలో క్రీ.శ 1242లో మెట్ల బావి నిర్మించినట్లు ఇక్కడ లభ్యమైన శిలా శాసనం ద్వారా తెలుస్తోంది. దశాబ్దాలుగా బావి పూడిపోవడంతో గ్రామ పెద్దలు పూడికతీయాలని నిర్ణయించారు. వీరికి వివిధ ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న యువకులు చేయూత అందించారు. గోవిందపల్లెకు చెందిన కార్మికుల సాయంతో పది రోజుల నుంచి చేపడుతున్న పూడికతీత పనులు ముగిశాయి. ఎర్రటి రాళ్లతో నిర్మించిన మెట్ల బావి కళ్లు చెదిరేలా కనిపిస్తోంది. 783 ఏళ్ల్లు గడిచినా ఒక్క రాయి కూడా చెదిరిపోకుండా ఇప్పటికీ అలాగే ఉంది. 35 అడుగుల మేర బావి లోతు ఉంది. లోపలి భాగంలోని నాలుగు వైపుల గోడల నుంచి నీళ్లు బావిలోకి చేరుతున్నాయి. ఓ వైపు ఇంజిన్ సాయంతో నీళ్లు బయటకు పంపింగ్ చేసి శుభ్రం చేస్తూ వచ్చారు.
– కొలిమిగుండ్ల
క్రీ.శ 1242లో నిర్మించినట్లు ఆధారాలు
గ్రామ పెద్దల చొరవతో పూడికతీత
నేటికీ చెక్కు చెదరని నిర్మాణం
నలువైపుల నుంచి బావిలోకి నీరు


