సామాన్యుడిపై గ్యాస్ ‘బండ’
కోవెలకుంట్ల: నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఆందోళన చెందుతున్న పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపింది. ఒక్కో సిలిండర్‌పై రూ. 50 పెంచడం, ఇప్పటికే డోర్ డెలవరీ పేరుతో మరో రూ. 50 వసూలు చేస్తుండటంతో వినియోగదారులకు భారంగా మారింది. జిల్లాలో దాదాపు 5.77 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో కుటుంబానికి రెండు నెలలకొక సిలిండర్ చొప్పున ఏడాదికి సగటున ఆరు గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. సిలిండర్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు సంబంధిత ఏజెన్సీలు రూ.10లతో డోర్ డెలవరీ చేయాల్సి ఉంది. ఈ నెల ఏడో తేదీ వరకు సిలిండర్ ధర రూ. 860 కాగా డెలవరీ పేరుతో రూ. 50 కలిపి వినియోగదారులకు రూ. 910 ప్రకారం సరఫరా చేశారు. మంగళవారం నుంచి గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం రూ. 50 పెంచడంతో సిలిండర్ ధర రూ. 960కి చేరింది. మారిన కాలానికనుగుణంగా ఇళ్లలో గ్యాస్ వినియోగం తప్పని సరి అయింది. కూలి పనులకు వెళ్లే కుటుంబాలు సైతం గ్యాస్‌ను వినియోగిస్తూ వంటలు తయారు చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపు, డెలివరీ చార్జీలు ప్రజలకు మరింత భారంగా మారాయి. గ్యాస్ కొనుగోలుకు రెండు నెలలకొకసారి రూ. వె య్యి వరకు వెచ్చించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం సిలిండర్‌పై రూ. 44.62 మాత్రమే సబ్సిడీ ఇస్తోంది. గ్యాస్ సిలిండర్‌కు పూర్తి ధర చెల్లిస్తే రెండు, మూడు రోజుల్లో సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాల్లో జమ అవుతోంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా తర్వాత గోదాము వద్దకు వెళ్లినా, డోర్ డెలివరీ ఇచ్చినా రూ. 960 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రూ. 50 అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పేదల కష్టం గ్యాస్ సిలిండర్ల కొనుగోలు, అదనపు వసూలుకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిలిండర్‌పై రూ. 50 పెంపు
డెలివరీ చార్జీపేరుతో
మరో రూ. 50 బాదుడు
సామాన్య, మధ్యతరగతి వర్గాలపై
ఆర్థిక భారం
ఆందోళన చెందుతున్న
వినియోగదారులు


