ఏపీ అంటే అమరావతి, పోలవరమే కాదు
నంద్యాల(అర్బన్): ఏపీ అంటే అమరావతి.. పోలవరమే కాదు. ఇది అంధ్రప్రదేశ్‌గా గుర్తెరిగి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. మే 31న నిర్వహించే సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ విధానాలు, వెనుకబడిన ప్రాంతాల భవిత అంశాలపై సమితి ఉపాధ్యక్షుడు వైఎన్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక ఐఎంఏ హాల్లో ప్రజా సంఘాల సమావేశం నిర్వహించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు సీమ ఉమ్మడి జిల్లాలోని సంఘాల నాయకులు హాజరైన కార్యక్రమంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. పాలకుల లోప బూయిష్ట విధానాలు నిర్లక్ష్యాల ధోరణి వల్ల సీమ సామాజికంగా, ఆర్థికంగా వెనక్కి నెట్టి వేయబడుతుందన్నారు. నాడు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే 150 టీఎంసీల నికర జలాలతో 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందేదన్నారు. కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా గోదావరి బానకచర్ల ప్రాజెక్టుల బదులుగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా గోదావరి జలాలను నాగార్జున సాగర్ కుడికాల్వకు తరలించి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని పూర్తిగా సీమ అవసరాలకే వినియోగించాలని కోరారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైకోర్టు, తదితరాలు సీమలో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సమితి మహి ళా నాయకురాలు, న్యాయ వాది శ్రీదేవి, వెలుగోండ సాధన సమితి నాయకులు కొండారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రహీం, రామ్మోన్‌రెడ్డి, శేషాద్రిరెడ్డి, జాఫర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


