నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో కనీస వసతులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పథకం కింద ఏటా రూ.వంద కోట్లు విడుదల చేసేది. నాలుగేళ్లుగా నిధుల విడుదలను నిలిపివేసింది. ప్రతి పీహెచ్‌సీకి ఏటా రూ.1.50 లక్షలు, ఆరోగ్య ఉపకేంద్రాల(సబ్‌సెంటర్ల)కు రూ.10 వేలు విడుదల అయ్యేవి. 2022–23 సంవత్సరంలో చివరిసారిగా నిధులను విడుదల చేసిన ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు మొండిచేయి చూపుతోంది. దీంతో జిల్లాలోని 34 పీహెచ్‌సీలు, 5 అర్బన్‌హెల్త్ సెంటర్లు, 257 సబ్ సెంటర్లు, 7 బస్తీ దవాఖానాల్లో నిర్వహణ భారంగా మారి కనీస సౌకర్యాలు కరువయ్యాయి.
ఎన్‌హెచ్‌ఎం నిధులతో చేపట్టే కార్యక్రమాలు..
జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందులో మాతాశిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు చర్యలు, గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ, కుటుంబ సంక్షేమం, కీటక జనిత, అసంక్రమిత, క్షయ, కుష్టు, సార్వత్రిక వ్యాధుల నివారణ, పారిశుద్ధ్యం, మలేరియా, డెంగీ జ్వరాల నివారణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాలుగేళ్లుగా నిధుల్లేక ఆయా కార్యక్రమాలు కుంటుపడిపోయాయి.
పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం..
గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుకోసం ప్రతి ఐదువేల జనాభాకు ఒకటి చొప్పున ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు (సబ్‌సెంటర్) ఏటా రూ.10వేల చొప్పున ఎన్‌హెచ్‌ఎం నిధులను విదుదల చేసేవారు. ఆ నిధులతో సబ్‌సెంటర్‌లో పారిశుద్ధ్య మెరుగు, నీటి ట్యాంకులను శుభ్రం చేయడం, అద్దెలు, తాగునీటి సౌకర్యాలకు వినియోగించే వారు. కానీ, నిధులు రాకపోవడంతో పారిశుద్ధ్య అస్తవ్యస్తంగా తయారైంది.
నిలిచిన కుటుంబ నియంత్రణ శిబిరాలు..
కుటుంబ నియంత్ర ఆపరేషన్ చేయించుకుంటే పురుషులకు రూ.1100, సీ్త్రలకు రూ.800 చొప్పున ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. కానీ, ఎన్‌హెచ్‌ఎం నిధులు విడుదలకాని కారణంగా నాలుగేళ్లుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్‌లో ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల వేలాది రూపాయలను భరించాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్లుగా నిలిచిన
ఎన్‌హెచ్‌ఎం నిధులు
అభివృద్ధికి దూరంగా పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు
కొనసాగని ఆరోగ్య కార్యక్రమాలు
ఆస్పత్రుల్లో కుంటుపడిన వైద్యసేవలు


