శాస్త్ర విజ్ఞానంతో కొందరి చేతుల్లోకే సంపద | - | Sakshi
Sakshi News home page

శాస్త్ర విజ్ఞానంతో కొందరి చేతుల్లోకే సంపద

Jun 29 2026 1:59 AM | Updated on Jun 29 2026 1:59 AM

ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

నల్లగొండ టౌన్‌ : శాస్త్ర విజ్ఞానం కొందరికి సంపద సృష్టిస్తుందని ఎమ్మెల్సీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న అన్నారు. జిల్లా ఔషధ అధికారి కాకి పరాబ్‌కుమార్‌ ఉద్యోగ విరమణ సందర్భంగా నల్లగొండలోని మెడికల్‌ కళాశాల ఎగ్జామినేషన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ కారణంగా సంపద ఆదానీ, అంబానీ చేతుల్లోకి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమించే వారిని పక్కన పెడతూ ప్రస్తుత పాలకులు సోమరిపోతులను ప్రోత్సహిస్తోందన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం వీపీ డాక్టర్‌ బి.రాజశేఖర్‌ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతను నిర్వహిస్తూనే సమాజంలో మార్పు కోసం తన కుటుంబ వారసత్వాన్ని పరాబ్‌ కొనసాగించారని తెలిపారు. అనంతరం పరాబ్‌కు జ్ఞాపికలు, పుస్తకాలు బహూకరించారు. శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్క్రతిక మండలి అధ్యక్షురాలు బండ్రు విమల, అంబటి నాగయ్య, ఎలమంచిలి రవీంద్రనాథ్‌, సోమ మల్లయ్య, అమృత రావు, వెంకట్‌రావు తదితరులు పాల్గొన్నారు.

హ్యాండ్‌బాల్‌ క్రీడలో

రాణించాలి

తిప్పర్తి : హ్యాండ్‌ బాల్‌ క్రీడలో విద్యార్థులు ఆసక్తి కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అబ్జర్వర్‌ ఎల్‌వి.రావు అన్నారు. తిప్పర్తిలో ఆదివారం నిర్వహించిన హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా నూతన హ్యండ్‌ బాల్‌ ఆసొసియేషన్‌ అధ్యక్షుడిగా నర్సింహారావు, కార్యదర్శిగా ఎండీ.అక్బర్‌, కోశాధికారిగా ఎండీ.బాబర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సాగర్‌ను సందర్శించిన చిన్నారెడ్డి

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రజావాణి ఇన్‌చార్జి, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నాగార్జునకొండ పురావస్తు మ్యూజియం, మహాస్తూపం, సింహాల విహారాలను సందర్శించారు. అనంతరం బుద్ధవనం చేరుకొని బుద్ధుడి పాదాలకు వందనం సమర్పించారు. మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు. ఆయనను బుద్ధవనం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శాసన, ఎస్టేట్‌ ఆఫీసర్‌ రవిచంద్ర కండువాలు, బ్రోచర్లతో సత్కరించారు. ఆయనకు టూరిజం గైడ్‌ సత్యనారాయణ నాగార్జునసాగర్‌ డ్యాం, నాగార్జునకొండ, బుద్ధవనం విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా నాగార్జునసాగర్‌ ను సందర్శించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బుద్ధవనం ఎంతో అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. వారి వెంట ప్రొఫెసర్‌ జలంధర్‌రెడ్డి, ప్రొటోకాల్‌ ఆఫీసర్‌ దండా శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement