నల్లగొండ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆసక్తి, అర్హత గల ప్రభుత్వ ఉపాధ్యాయులు జూలై 10వ తేదీలోగా nationalawardstoteachers.education.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ సుశీందర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న కాపీని నల్లగొండలోని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
ఎకై ్సజ్ శాఖలో బదిలీలు
నల్లగొండ : జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (డీపీ–ఈఓ)గా పనిచేస్తున్న బి.సంతోష్‌ను సిద్దిపేట జిల్లా డీపీ–ఈఓగా బదిలీ చేశారు. నల్లగొండలో ఏపీ–ఈఎస్‌గా విధులు నిర్వహిస్తున్న బి.చాణక్యను మంచిర్యాల జిల్లా డీపీ–ఈఓగా నియమించారు. డీపీ–ఈఓ పోస్టు ఖాళీ కావడంతో, నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్)కు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పోస్టు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ప్రస్తుతం నల్లగొండ డీసీగా పనిచేస్తున్న ఎ.శ్రీనివాస్‌రెడ్డిని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో జాయింట్ డైరెక్టర్ (ఈస్ట్)గా పనిచేస్తున్న సివి.శశిధర్‌రెడ్డిని నల్లగొండ డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. సరూర్‌నగర్ డీపీ–ఈఓగా ఉన్న ఎస్.ఉజ్వలరెడ్డికి నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్)గా పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ అయిన అధికారులు తక్షణమే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయం ఆదేశించింది.
హెడ్‌కానిస్టేబుళ్లకు
ఎస్పీ అభినందన
నల్లగొండ : జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న 10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పట్టీలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదోన్నతి కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా మరింత పెరిగినట్లేనని చెప్పారు. కొత్త హోదాలో మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐ సంతోష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
మిర్యాలగూడ అర్బన్ : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలకు అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న సంఘం ఈసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో నాయకులు మాడుగుల శ్రీనివాస్, మర్రి జోజికుమార్, పెరుమళ్ల ధనమ్మ, సావిత్రి, శోభ, కోడిరెక్క ప్రవీణ్, అభినవ్, నాగరాజు, నగేష్, నాగేంద్ర, సుహాసిని పాల్గొన్నారు.


