నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (సర్) భాగంగా ఇంటింటికి వచ్చే బీఎల్‌ఓ, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లకు ప్రజలు సహకారం అందించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ అన్నారు. గురువారం నుంచి ప్రారంభమైన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఆయన జిల్లా కేంద్రంలోని రహమత్‌నగర్‌లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. యజమానులతో మాట్లాడారు. ఇంటో ఎంతమంది ఉంటారు, ఓటర్లు ఎంతమంది ఉన్నారని? అడిగి తెలుసుకున్నారు. యాప్ అప్‌డేట్ చేసుకున్నారా అని బీఎల్‌ఓను ప్రశ్నించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారని, ఇందులో పూర్తి వివరాలను నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లను జతపరచి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, నల్లగొండ తహసీల్దార్ పరశురాం, కార్పొరేటర్ అమీనా ఫరీద్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


