జిల్లాలో 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత జాబితాతో పోల్చి ఇప్పటివరకు 86.62 శాతం మ్యాపింగ్ పూర్తి చేశారు. మొత్తం 15,16,253 మంది ఓటర్లలో 13,13,325 మంది వివరాలు మ్యాపింగ్ కాగా, ఇంకా 2,02,928 మంది (13.38 శాతం) వివరాల ధ్రువీకరణ కావాల్సి ఉంది. మ్యాపింగ్ పూర్తయిన వారిలో కూడా 4,02,517 మంది (30.65 శాతం) ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, చిరునామా వంటి వివరాల్లో పొరపాట్లు ఉన్నట్లు వెల్లడైంది. వాటిని సరి చేసేందుకు అవకాశాలు కల్పించనున్నారు.
ఫ ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనున్న
బీఎల్‌ఓలు
ఫ 2002, 2026 ఓటర్ల జాబితాల ఆధారంగా మ్యాపింగ్
ఫ ఇంకా మ్యాపింగ్ కాని ఓటర్లు
2.02 లక్షల మంది
ఫ బీఎల్‌ఓలకు కిట్ల అందజేత,
శిక్షణ కూడా పూర్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. వలసలు, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉండటం, మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో ఉంటే వాటిని తొలగిస్తారు. వంద రోజుల పాటు చేపట్టే ఈ ప్రక్రియ ద్వారా కొత్త ఓటరు జాబితాను రూపొందించనున్నారు. ఇందులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌ఓలు) నేటినుంచి ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్‌కు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసి వివరాలు సేకరించనున్నారు.
జిల్లాలోని 1812 పోలింగ్ కేంద్రాలకు ఒక్కో బీఎల్‌ఓను, వారిపై పర్యవేక్షణ కోసం 181 మంది సూపర్ వైజర్లను నియమించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్‌ను (బీఎల్‌ఏ) కూడా నియమించుకునే అవకాశం కల్పించారు. వారు కూడా ఓటర్లకు సహకరిస్తూ పారాలను నింపడంలో భాగస్వామ్యులు కావచ్చు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 15,16,253 మంది ఓటర్లున్నారు. ప్రతి ఓటర్‌కు రెండు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయనున్నారు. ఒక పారాన్ని నింపి సంతకం చేసి బీఎల్‌ఓకు ఇవ్వాల్సి ఉండగా, మరో ఫారాన్ని భవిష్యత్ అవసరాల కోసం తమ వద్ద ఉంచుకోవాలి. ఇందుకోసం మొత్తం 31,62,352 పారాలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే బీఎల్‌ఓలకు అవసరమైన కిట్లు, శిక్షణను కూడా ఇచ్చారు. మొదటి నాలుగు రోజుల పాటు ఇంటింటికి తిరిగి పారాలు పంపిణీ చేస్తారు. అనంతరం వాటిని తిరిగి సేకరించి రోజు వారీగా ఆన్‌లైన్ చేయనున్నారు.
ఈసారి సర్ ప్రక్రియలో భాగంగా 2002 నాటి ఓటర్ల జాబితా, ప్రస్తుత 2026 ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ప్రతి ఓటర్‌ను ధ్రువీకరించనున్నారు. 2002లో జిల్లాలో 10,92,369 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం 15,16,253కు చేరింది. 24 సంవత్సరాల్లో ఓటర్ల సంఖ్య 4,23,884కు పెరిగింది. 2002 జాబితాలోని కుటుంబ సభ్యుల వివరాలను ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా వివరాలను సరిపోల్చి అసలైన ఓటర్లను గుర్తించనున్నారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లు, మరణించిన వారి పేర్లు, అర్హతలేని పేర్లను గుర్తించి తొలగించనున్నారు. 2002 జాబితాలో పేర్లు లేని వారు లేదా కుటుంబ వివరాలతో మ్యాపింగ్ కాని వారు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాలి.
సర్ ప్రక్రియ వచ్చే నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఆ తరువాత ముసాయిదా ఓటర్ల జాబితాను జులై 31వ తేదీన ప్రకటిస్తారు. అందులో తమ పేరు లేకపోయినా, వివరాల్లో పొరపాట్లు ఉన్నా, కొత్తగా పేర్లు నమోదు చేయించుకోవాలన్నా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఓటు తొలగిస్తే సంబంధిత వ్యక్తులు ఫారం 6తో పాటు డిక్లరేషన్ సమర్పించాలి. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి జత చేసి బీఎల్‌ఓకు అందజేయాలి.
జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో నల్లగొండ నియోజక వర్గంలోనే తక్కువ మ్యాపింగ్ అయింది. కేవలం 75.01 శాతం మ్యాపింగ్ కాగా నాగార్జునసాగర్‌లో 95.40 శాతం, నకిరేకల్‌లో 95.04 శాతం, దేవరకొండలో 88.53 శాతం, మునుగోడులో 87.90 శాతం , మిర్యాలగూడలో 77.50 శాతం నమోదైంది. దేవరకొండ నియోజక వర్గంలో అత్యధికంగా 96,725 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
‘సర్’ సాగుతుంది ఇలా..
– జూన్ 25 నుంచి ఇంటింటి గణన ప్రారంభం
– జులై 31వ తేదీన ఓటరు ముసాయిదా జాబితా ప్రకటన
– జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
– సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాల పరిష్కారం
– అక్టోబర్ 1వ తేదీన ఓటరు తుది జాబితా ప్రకటన


