మండలంలో గుట్టలు, ప్రభుత్వ భూములు ఇలాగే మాయమైపోతే.. భవిష్యత్‌లో ప్రభుత్వ భవనాలు, సబ్‌స్టేషన్లు, సోలార్ ప్లాంట్ల వంటి అవసరాలకు స్థలం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, భూ ఆక్రమణలు, మట్టి తవ్వకాలపై పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
నిడమనూరు : నిడమనూరు మండలంలో గుట్టల తవ్వకాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒకవైపు వ్యవసాయ సీజన్ దగ్గర పడుతుండటంతో.. గుట్టలను, ప్రభుత్వ అసైన్డ్ భూములను తవ్వేస్తూ సాగు భూములుగా మార్చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల గుట్టలు సగానికి పైగా మాయమవగా, తాజాగా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు.
‘ఎర్రగుట్ట’ చుట్టూ భారీ తవ్వకాలు..
నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి ఎర్రగుట్ట చుట్టుపక్కల రెండు వారాలుగా జోరుగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఎర్రబెల్లి, సోమోరిగూడెం, బుంటువారిగూడెం, మారుపాక గ్రామాలకు చెందిన కొందరు ఈ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. రికార్డుల ప్రకారం సర్వే నెంబరు 494లో 115 ఎకరాల 35 గుంటలుగా ఉన్న ఈ గుట్ట.. ఇప్పుడు ఆక్రమణల కోరల్లో చిక్కుకుంది. ఇందులో రెండు సబ్ స్టేషన్లకు 6 ఎకరాలు, వాటర్ ట్యాంక్ (మిషన్ భగీరథ) కోసం కొంత స్థలం కేటాయించారు. భూ పంపిణీ కింద 30 నుండి 40 ఎకరాలు ఇవ్వగా.. దానికి రెట్టింపు భూమి ఆక్రమణకు గురైంది. మరో 10 నుంచి 15 ఎకరాల్లో తెల్లరాయి మైనింగ్ జరుగుతుండగా, మరికొందరు 20 ఎకరాల్లో తమకు పట్టా ఉందంటూ మట్టిని విక్రయిస్తున్నారు.
మండలంలోని ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలు
● మార్లగడ్డ–రాజన్నగూడెం (సర్వే నెం. 278) వెనిగండ్ల దేవునిగుట్ట వెనుక భాగాన్ని గతంలో పట్టా చేసుకోగా, ఇప్పుడు మట్టిని తవ్వి అమ్ముకుంటూ భూమిని చదును చేస్తున్నారు.
● గుంటకగూడెం బోడు (నిడమనూరు చెరువు పైన) ఇక్కడ అప్పుడప్పుడు రహస్యంగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఇప్పటికే 30 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురికాగా.. ఇక్కడ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్, సబ్‌స్టేషన్ ఏర్పాటును ఆక్రమణదారులు అడ్డుకోవడం గమనార్హం. గతంలో సర్వే నెంబరు 294 లోని 35 ఎకరాల ప్రభుత్వ భూమిని ముగ్గురు ప్రభుత్వ అధికారులే ఆక్రమించుకున్నా.. రెవెన్యూ అధికారులు కేవలం నోటీసులకే పరిమితమయ్యారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
● ముప్పారం సబ్‌స్టేషన్ గుట్టకు ఇరువైపులా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ముప్పారం–గుంటిపల్లి, ముప్పారం–సోమోరిగూడెం రోడ్డులోని గుట్టలు సగానికి పైగా మాయమయ్యాయి.
● తుమ్మడం పెద్ద చెరువు సర్వే నంబర్ 880 అసైన్డ్ భూమిలో 50–120 మీటర్ల వెడల్పున్న యేన ప్రాంతంలో మట్టిని తవ్వి సాగుకు సిద్ధం చేస్తున్నారు.
● వెనిగండ్ల సర్వే నంబర్ 99లో ఇటీవల ప్రధానమంత్రి సడక్ యోజన రహదారి పనుల అనుమతుల చాటున కొందరు అక్రమంగా మట్టి విక్రయాలు జరిపారు.
నిడమనూరు మండలంలో యథేచ్ఛగా సాగుతున్న మట్టి తవ్వకాలు
ఫ సగానికిపైగా ఆక్రమణకు గురైన ఎర్రబెల్లి గుట్ట
ఫ పట్టా భూముల పేరుతో మట్టి దందా
ఫ నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్న అధికారులు


