నల్లగొండ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. బుధవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందినప్పుడే పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. ‘ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ఆయన అధికారులను అభినందించారు. అధికారులు ఆర్థిక విషయాలపై పూర్తి అప్రమత్తంగా ఉంటూ పథకాలను అమలు చేయాలని, చిన్న చిన్న మరమ్మతులు ఉంటే జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ ద్వారా డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లలో మరమ్మతులతో పాటు, విద్యార్థులు దోమలు బారిన పడకుండా దోమ తెరలు, తలుపులు వంటి మరమ్మతులన్నీ చేపట్టాలని సూచించారు. జిల్లాలో పథకాల ప్రగతిని ఆయా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అంతకుముందు ఆయనకు.. కలెక్టర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్‌ఓ దశరథ్, డీఎఫ్‌ఓ రాజశేఖర్, సీపీఓ శ్రీనివాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్


