నల్లగొండను మోడల్‌ సిటీ చేస్తా | - | Sakshi
Sakshi News home page

నల్లగొండను మోడల్‌ సిటీ చేస్తా

Jun 25 2026 9:33 AM | Updated on Jun 25 2026 9:33 AM

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా మోడల్‌ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రూ.కోటీ 20 లక్షలతో చేపట్టనున్న నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌ విస్తరణ, ఆధునికీకరణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. సిటీ పరిధిలో రెండు సిటీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ నగరంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిటీ బస్సు సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. నల్లగొండ అదనంగా 30 బస్సులు కేటాయించామని, 56 మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎస్‌ఎల్‌బీసీ వద్ద పెట్రోల్‌ పంపు, ఇందిరా మహిళ శక్తి క్యాంటిన్‌, రెస్టారెంట్‌ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. బస్టాండ్‌ విస్తరణలో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్‌ గార్డెన్‌, బాత్రూమ్‌లు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పనుల కోసం అదనంగా రూ.5 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. నగర అభివృద్ధిలో భాగంగా రూ.83 కోట్లతో తాగునీటి శుద్ధి (వాటర్‌ ఫిల్టర్‌) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది మోడల్‌ సిటీగా రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఖుస్రోషా ఖాన్‌, మేయర్‌ బుర్రి చైతన్య, రాష్ట్ర ప్రణాళిక ఆర్థిక శాఖ సెక్రటరీ గౌరవ్‌ ఉప్పల్‌, కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్చంద్ర పవార్‌, ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్న, డిప్యూటీ మేయర్‌ అమీర్‌ అలీ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, కార్పొరేటర్‌ కవిత, రమేష్‌, లైజన్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండలో ఆర్టీసీ బస్టాండ్‌ విస్తరణ పనులకు శంకుస్థాపన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement