సెన్సార్‌లతో పనిచేసే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్..
సాంకేతిక పద్ధతిలో టెస్టులను నిర్వహించేందుకు రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు డ్రైవింగ్ టెస్టులు, ఫిట్‌నెస్ టెస్టులను అధికారుల పర్యవేక్షణలో నిర్వహించి, డ్రైవింగ్ సరిగ్గా చేశారా? వాహనం ఫిట్‌నెస్ సరిగ్గా ఉందా? లేదా? చెక్ చేసి, సర్టిఫై చేసే వారు. ఇకపై సాంకేతిక సహకారంతో టెస్టులను నిర్వహిస్తారు. ఇందుకు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లు, ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్ట్ సెంటర్ల ఏర్పాటుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది.
ఫ అందుకు కొత్త ట్రాక్‌ల నిర్మాణానికి కసరత్తు
ఫ దండెంపల్లి వద్ద ఐదు ఎకరాల్లో నిర్మించేలా ప్రతిపాదనలు
ఫ రవాణా శాఖ
కార్యాలయంతో పాటు ట్రాక్‌లు అక్కడే..
ఫ ఆటోమేటెడ్ విధానంలో డ్రైవింగ్, వాహనాల ఫిట్‌నెస్ టెస్టులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లు, ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్ట్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోనూ ఆ దిశగా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నల్లగొండ కలెక్టరేట్ వెనుక భాగంలో రవాణా శాఖ కార్యాలయం ఉంది. అక్కడే కార్యాలయ సేవలతోపాటు టెస్టులను నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవల కలెక్టరేట్ విస్తరణలో భాగంగా రవాణా శాఖ స్థలంలో కలెక్టరేట్ అదనపు భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. దీంతో డ్రైవింగ్ ట్రాక్ సగం వరకు పోయింది. డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ కోసం హైదరాబాద్ రోడ్డులో స్థలాన్ని ఇవ్వాలని భావించినా అది లిటిగేషన్‌లో ఉండటంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. నల్లగొండ మండలంలోని దండెంపల్లిలో గతంలో తోళ్ల పరిశ్రమ కోసం ఇచ్చిన స్థలాన్ని రవాణా శాఖకు ఇవ్వాలని, అక్కడే రవాణా శాఖ కార్యాలయాలతోపాటు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ఫిట్‌నెస్ టెస్టు సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే వాటి నిర్మాణ పనులను ప్రారంభించాలని రవాణా శాఖ నిర్ణయించింది.
ఆటోమేటెడ్ ఫిట్‌నెస్‌లోనూ అంతే..
ఇప్పటివరకు వాహన ఫిట్‌నెస్‌ను అధికారులు స్వయంగా పరిశీలించి ఫైలు రాసి ఫిట్‌నెస్ జారీచేస్తారు. స్టీరింగ్, వీల్ అలైన్‌మెంట్, పొల్యుషన్, లైట్స్, బ్రేక్ తదితర కేటగిరీల్లో ఫిట్‌నెస్‌ను పరిశీలిస్తారు. ఆటోమేటెడ్ టెస్ట్‌లో.. వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసే మిషన్లే పరీక్షిస్తాయి. వాటి ఫలితాల ఆధారంగానే అధికారులు సర్టిఫై చేస్తారు. ఒక్కో పరీక్షను ఒక్కో మిషన్ నిర్వహించనుంది.
ఇంటివద్ద నుంచే లర్నింగ్ లైసెన్స్
లర్నింగ్ లైసెన్స్‌ను ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్ ద్వారా పొందేలా రవాణ శాఖ సేవలను సులభతరం చేస్తోంది. ప్రస్తుతం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి లర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. త్వరలో ఆన్‌లైన్ లర్నింగ్ టెస్ట్ విధానం రాబోతోంది. అందులో వాహనదారులు రవాణా శాఖ పోర్టల్ ఆన్‌లైన్ లర్నింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకొని, కంప్యూటర్‌లోనే టెస్ట్ రాసి లర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు.
రవాణా శాఖ సేవలను సులభతరం చేసేందుకు, పారదర్శకతను పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ విధానాన్ని వాహనాల డీలర్లకు అప్పగించింది. త్వరలో ఆన్‌లైన్ లర్నింగ్ టెస్ట్ విధానం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. అలాగే ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు, ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తోంది.
– కిరణ్‌కుమార్,
మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్, నల్లగొండ
డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ (మోడల్)
కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని పూర్తి స్థాయి డ్రైవింగ్ లైసెస్స్ తీసుకోవాలనుకునే వాహనదారుడు కచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాలి. అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఇందులో భాగంగా 8, హెచ్ ఆకారంలో ఉండే ట్రాక్‌లో రివర్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితర కేటగిరీల్లో సదరు వాహనదారుడు వాహనాన్ని ఎడ్జెస్‌కు తగులకుండా నడుపుతున్నాడా? లేదా? అన్న విషయాలను రవాణా శాఖ అధికారులు స్వయంగా పరిశీలించి లైసెన్స్ జారీ చేస్తారు. అయితే, ఇప్పుడు కొత్తగా రాబోయే ఆటోమేటెడ్ టెస్టింగ్ ట్రాక్ కూడా 8, హెచ్ ఆకారంలోనే ఉన్నప్పటికీ అందులో సెన్సార్లు ఉంటాయి. సెన్సార్‌లో గుర్తించి.. ఏమైనా తప్పు చేస్తే అతను డ్రైవింగ్‌లో ఫెయిల్ అయినట్లుగా సిస్టమ్‌లో చూపిస్తుంది. దాంతో అధికారులు అతను ఫెయిల్ అయినట్లుగా నిర్ధారిస్తారు.


