ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా.. మారని పలువురు అధికారుల తీరు | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా.. మారని పలువురు అధికారుల తీరు

Jun 23 2026 1:58 AM | Updated on Jun 23 2026 1:58 AM

నల్లగొండ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తూ లంచగొండులపై ఉక్కుపాదం మోపుతున్నా కొందరు ప్రభుత్వ అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. ఏసీబీ హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు, ట్రాప్‌ కేసులు వరుసగా నమోదవుతున్నా లంచాల జోరు మాత్రం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలో 2026 సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన నాలుగు ఏసీబీ ట్రాప్‌ కేసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాల్సిన కొందరు అధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని లంచాలు డిమాండ్‌ చేస్తుండగా, బాధితుల ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. అయినప్పటికీ అవినీతికి అలవాటు పడిన కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు.

కఠిన శిక్షలు అమలు చేయాల్సిందే..

జిల్లాలో కేవలం ఆరు నెలల వ్యవధిలో నాలుగు ట్రాప్‌ కేసులు నమోదు కావడం ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఇంకా ఏ స్థాయిలో కొనసాగుతోందో స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ, విద్యుత్‌, వక్ఫ్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ వంటి ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల అధికారులు ఏసీబీ వలలో చిక్కడం ఆందోళన కలిగిస్తోంది. ఏసీబీ అధికారులు నిరంతరం నిఘా ఉంచి దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు అధికారులు లంచాలు తీసేందుకు వెనుకాడకపోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పూర్తిగా అరికట్టాలంటే కేవలం ట్రాప్‌ కేసులు మాత్రమే కాకుండా శాఖాపరమైన కఠిన చర్యలు, వేగవంతమైన విచారణలు, దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాదిలో ఏసీబీ కేసులు ఇలా..

● ఫిబ్రవరి 2న గుర్రంపోడు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ హకీం భూ రికార్డులకు సంబంధించిన పని నిమిత్తం రూ.20 వేల లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. రెవెన్యూ శాఖలో ఈ ఘటన సంచలనం సృష్టించింది.

● ఏప్రిల్‌ 16న దేవరకొండ విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ (ఏడీఈ) బిల్లుల క్లియరెన్స్‌ కోసం రూ.30 వేల లంచం స్వీకరిస్తూ పట్టుబడ్డాడు.

● జూన్‌ 6న మిర్యాలగూడలో వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ మహమూద్‌ అధికారిక నివేదిక కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకు3న్నారు.

● జూన్‌19న నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జి.పవన్‌కుమార్‌ భూమి సర్వే నివేదిక జారీ చేయడానికి రూ.35 వేల లంచం డిమాండ్‌ చేసి, అందులో రూ.15 వేల స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఫ ఆరు నెలల్లో ఏసీబీకి పట్టుబడిన నలుగురు అధికారులు

ఫ ప్రజలకు పారదర్శకంగా అందని సేవలు

ఫ లంచగొండులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement