నల్లగొండ టూటౌన్ : చెస్ క్రీడాకారులు మేకల అభినవ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ అలీ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో మేకల అభినవ్ స్మారకార్థం మేకల అభినవ్ మెమోరియల్ కంబైన్డ్ జిల్లాస్థాయి చెస్ టోర్నమెంట్‌ను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీరుడు దయాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభినవ్ చెస్‌లో జిల్లాకు పేరుతెచ్చాడని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చెస్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ సెక్రటరీ కరుణాకర్‌రెడ్డి, చీఫ్ అర్బీటర్ విశ్వప్రసాద్, మేకల అభినవ్ తల్లిదండ్రులు మేకల వెంకటేశ్వర్లు, అరుణ, కృష్ణారెడ్డి, కళ్యాణి, శోభన్, రమేష్, చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు.
కవి సమ్మేళనానికి శ్రీనివాసాచారి ఎంపిక
రామగిరి(నల్లగొండ) : చండూరుకు చెందిన కవి, సాహితీవేత్త, పరిశోధకుడు ఇడికోజు శ్రీనివాసాచారి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వహించనున్న కవి సమ్మేళనానికి ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాల్కురికి సోమన మూల వేదికపై నిర్వహించనున్న ఈ కవి సమ్మేళనంలో రాష్ట్రంలోని ప్రముఖ కవులతో పాటు ఇడికోజు శ్రీనివాసాచారి పాల్గొని తన కవితను వినిపించనున్నారు. ఇడికోజు శ్రీనివాసాచారి తెలుగు సాహిత్య రంగంలో కవి, విమర్శకుడు, పరిశోధకుడిగా విశిష్ట సేవలు అందిస్తున్నారు. కవి సమ్మేళనానికి శ్రీనివాసాచారి ఎంపిక కావడంపై నల్లగొండ జిల్లా కవులు, సాహిత్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులకు అండ..
ఏఐటీయూసీ జెండా
గుర్రంపోడు : కార్మికుల హక్కులకు కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం గుర్రంపోడులో జరిగిన ఏఐటీయూసీ మండల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర పాలకుల కార్మిక వ్యతిరేక విధానాల వల్ల శ్రమ దోపిడీ పెరిగిందన్నారు. ప్రధాని మోదీకి కార్పొరేట్ల రక్షణ తప్ప కార్మిక సంక్షేమం పట్టదన్నారు. అనంతరం ఏఐటీయూసీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఆర్.లక్ష్మీపతి, మండల అధ్యక్షుడిగా ఎస్‌కే.అమీర్, ఉపాధ్యక్షులుగా జాల నర్సింహ్మ, నారాయణ, ప్రధాన కార్యదర్శిగా జాల పెదనర్సింహ, శ్రీను, కార్యదర్శిగా పోలేని సత్తయ్య, కోశాధికారిగా తవిటి వెంకన్నను ఎన్నుకున్నారు.


