
పత్తి అమ్మకం.. ఇక సులువు
గుర్రంపోడు : పత్తి అమ్మకానికి ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తోంది. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్‌తో పత్తి అమ్మకాలు చేపట్టేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సన్నద్ధమవుతోంది. యాప్ ద్వారా స్లాట్ బుకింగ్‌పై వ్యవసాయాధికారులకు బుధవారం శిక్షణ ఇచ్చింది. వీరు క్లస్టర్ల వారీగా రైతులకు కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన కల్పిస్తారు. రైతులు పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలంటే అండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఆయా తేదీల్లో ఖాళీలను బట్టి స్లాట్ బుకింగ్ చేసుకుని తమ దిగుబడులను ఆయా సీసీఐ కేంద్రాలైన మిల్లులకు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ విధానం వల్ల కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన అవసరం లేకపోవడంతోపాటు, కేంద్రాల వద్ద ట్రాక్టర్లు, లారీల రద్దీ ఉండి రహదారులపై ట్రాఫిక్ జామ్‌ల సమస్యకు కూడా చెక్ పడనుంది.
స్లాట్ బుకింగ్ ఇలా..
ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో ప్లే స్టోర్‌కు వెళ్లి కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. ఆ తర్వాత భాష ఎంపిక చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులు తమ మాతృభాషను ఎంచుకోవచ్చు. హోమ్ పేజీలో క్లిక్ చేసే బుకింగ్ ఫామ్ తెరుచుకుంటుంది. ఈ ఫారమ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోబడిన వివరాలు ఉంటాయి. జిల్లా, మార్కెట్, అంచనా వేసిన దిగుబడిని క్వింటాళ్లలో నమోదు చేయాలి. ఇంకా మిగులు పరిమాణం అంచనా కూడా నమోదు చేయాలి. ఆ తర్వాత మూడు రోజుల వరకు తేదీల్లో స్లాట్ సమయం, ఎన్ని స్లాట్‌లు ఉన్నాయో, మిల్లు సామర్థ్యం వివరాలు చూపుతుంది. తెరిచిఉన్న స్లాట్‌ను బుక్ చేసి నిర్ధారణ చేస్తే ఐడీతో స్లాట్ విజయవంతంగా బుక్ చేసినట్లు సందేశం చూపుతుంది. హోమ్ పేజీలో స్లాట్ బుకింగ్ తేదీ, సమయం, మిల్లు వివరాలు కనిపిస్తాయి. స్లాట్‌ను రద్దు చేయాలనుకుంటే యాప్‌లో కారణం నమోదు చేసి రద్దు చేసుకునే వీలు కూడా ఉంది. ఆ తర్వాత లాగ్ అవుట్ కావాలి. స్లాట్ బుకింగ్‌పై క్లస్టర్ల వారీగా రైతులకు అధికారులు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు.
ఫ కపాస్ కిసాన్ యాప్ ద్వారానే స్లాట్ బుకింగ్ విధానం అమలు
ఫ చెల్లింపు వివరాలూ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం
ఫ కేంద్రాల వద్ద రైతుల పడిగాపులకు చెక్
పత్తి రైతులకు అవగాహన కల్పించాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ : పత్తి కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడకుండా ‘కపాస్ కిసాన్ యాప్’పై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్లగొండలోని ఉదయదిత్య భవన్‌లో ఉమ్మడి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కపాస్ కిసాన్ యాప్‌పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రైతులు పత్తి అమ్మేందుకు ఆన్‌లైన్‌లో తప్పుగా బుకింగ్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు పడతారని.. అలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద హ్యాండ్ హోల్డింగ్ పర్సన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం పత్తికి క్వింటాకు రూ.8,100 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 8 నుంచి 12 శాతం తేమ మించకుండా రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, ఉమ్మడి జిల్లా (నల్లగొండ, భువనగిరి, యాదాద్రి) వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.