
గురుకుల ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసులు
నల్లగొండ: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఎస్‌ఎల్‌బీసీ కాలనీలోని తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌కు కలెక్టర్ ఇలా త్రిపాఠి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం కలెక్టర్ ఆ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ప్రిన్సిపాల్ వేణుగోపాల్ పాఠశాలలో భోజనం చేయాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి భోజనం కోసం బయటకు వెళ్లారు. దీంతోపాటు పాఠశాలలో అపరిశుభ్రత నెలకొని ఉండడం నిర్వహణ సరిగా లేకపోవడం, కొందరు ఉపాధ్యాయులు పాఠశాల సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు కలెక్టర్ గుర్తించారు. నిధులు సరిపడా విడుదలవుతున్నా సౌకర్యాలు లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రిన్సిపాల్‌కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యమైన భోజనం అందించాలని, అవసరమైన అన్ని వసతులు కల్పించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్డీఓలు వారి పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం కాసేపు విద్యార్థులకు కలెక్టర్ పాఠాలు చెప్పారు. ఆమె వెంట నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.
ఫ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కొరడా
ఫ మౌలిక వసతులు కల్పించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక