కటకటాల్లోకి నాయక్‌ | - | Sakshi
Sakshi News home page

కటకటాల్లోకి నాయక్‌

Oct 12 2025 6:37 AM | Updated on Oct 12 2025 6:37 AM

కటకటా

కటకటాల్లోకి నాయక్‌

నల్లగొండ : అధిక వడ్డీ ఆశచూపి తన ఏజెంట్ల ద్వారా వందలాది మంది వద్ద రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన రమావత్‌ బాలాజీనాయక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ కేసు వివరాలు వెల్లడించారు. పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామం పలుగుతండాకు చెందిన రమావత్‌ బాలాజీనాయక్‌ 2020లో ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ వ్యాపారం కోసం బంధువుల వద్ద రూ.5 లక్షలు రూ.2 వడ్డీతో అప్పుగా తీసుకుని వ్యాపారం చేసి నష్టపోయాడు. తర్వాత రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని నిర్ణయించి రూ.2 వడ్డీకి ఎక్కడా డబ్బులు దొరక్కపోవడంతో రూ.6 వడ్డీ ఇస్తానని ఆశచూపి అదే గ్రామానికి చెందిన పలువురి నుంచి రూ.10 లక్షలు, రూ.5 లక్షలు వడ్డీకి తీసుకుని.. వారికి క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ నమ్మించాడు. కొంత మంది ఏజెంట్లను నియమించుకుని.. తండాలు, గ్రామాల్లో నూటికి రూ.10 వడ్డీ చెల్లిస్తానని డబ్బులు తీసుకుని వారికి ప్రామిసరి నోట్లు రాసిచ్చాడు. తీసుకున్న డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపాడు. ఖరీదైన కార్లు, విల్లాలు కొని జనాలను నమ్మించాడు. నల్లగొండలో ఐటీ హబ్‌ తనదేనని, హైదరాబాద్‌లో వెంచర్లు చూపించి తనవేనని జనాలను నమ్మబలికాడు.

111 వైన్‌ షాపులకు టెండర్లు..

అప్పులు చేస్తూ రెండేళ్ల క్రితం జరిగిన వైన్స్‌ టెండర్లలో జిల్లాలో 111 షాపులకు టెండర్లు వేయగా.. ఒక్కషాపు మాత్రమే దక్కింది. డిపాజిట్ల కోసమే రూ.రెండున్నర కోట్లు ఖర్చు చేశాడు. స్టాక్‌ మార్కెట్‌లోనూ ఇంట్రా డే ట్రేడింగ్‌ (ప్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌)చేసి రూ.12.15 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆర్‌బీఎన్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు.

మూడేళ్ల పాటు వడ్డీ ఇవ్వడంతో నమ్మిన జనం

జనాల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకున్న బాలాజీనాయక్‌ వారికి మూడేళ్లకు పైగా వడ్డీ చెల్లించాడు. అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు.. మళ్లీ కొత్త వారి వద్ద అప్పులు చేశాడు. ఆరు నెలలుగా వడ్డీ ఇవ్వకపోవడంతో అప్పు ఇచ్చిన వారు బాలాజీనాయక్‌ను నిలదీస్తుండడంతో తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో బాలాజీనాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

డిపాజిట్‌ యాక్ట్‌ కింద

కేసు నమోదు..

నిందితుడు బాలాజీనాయక్‌పై డిపాజిట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అతని బంధువులు, బినామీల పేరున ఎలాంటి ఆస్తులు ఉన్నాయనేది విచారణ చేస్తామని వివరించారు. బాలాజీనాయక్‌ను రిమాండ్‌ చేసిన తర్వాత మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారించి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. అతని సెల్‌ఫోన్‌లో ఉన్న సమాచారం ఆధారంగా 106 మంది నుంచి రూ.46 కోట్లు తీసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని తెలిపారు. అతనికి 4 కార్లు ఉండగా.. ఒక పర్చునార్‌కారు, స్కార్పియో సీజ్‌ చేశామని, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, మిర్యాలగూడ, హయత్‌నగర్‌, నేరేడుచర్ల, పలు తండాల్లో ఇళ్లు, దామరచర్ల, వద్దిపట్లలో వ్యవసాయ భూములకు సంబంధించి రాసిచ్చిన ప్రామిసరి నోట్లు 36, 7 సెల్‌పోన్లు స్వాధీనం చేస్తున్నామని తెలిపారు. బాధితులు ఎవరైనా.. ఎంత మొత్తం ఇచ్చారో.. ఆ వివరాలతో పీఏపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వాటిని కోర్టుకు సమర్పిస్తామని, డబ్బులు ఇచ్చిన వారికి చట్టపరంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో ఏఎస్పీలు రమేష్‌, మౌనిక పాల్గొన్నారు.

బాలాజీపై 12 మంది ఫిర్యాదు

పెద్దఅడిశర్లపల్లి : అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీపై శనివారం గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 12 మంది భాధితులు ఫిర్యాదు చేసినట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు.

ఫ అధిక వడ్డీ ఆశ చూపి రూ.కోట్లు తీసుకుని మోసం బాలాజీనాయక్‌ అరెస్టు

ఫ డిపాజిట్‌ యాక్టు కింద కేసు నమోదు

ఫ వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

కటకటాల్లోకి నాయక్‌1
1/1

కటకటాల్లోకి నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement