
తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణదానం
మోటకొండూర్: ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడడంతో యువకుడి బ్రెయిన్ డెడ్ కాగా.. అతడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వివరాలు.. మోటకొండూర్ మండలం చాడ గ్రామానికి చెందిన గంధమల్ల సైదులు(27) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 2న దసరా పండుగ రోజు సాయంత్రం గ్రామంలో జమ్మికి వెళ్లి తిరిగి తన బైక్‌పై ఇంటికి వస్తుండగా.. అదుపుతప్పి కంకర రాళ్లపై పడ్డాడు. దీంతో అతడి తల వెనుక భాగంలో బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సైదులు మృతి చెందాడు. సైదులు తల్లిదండ్రులు లక్ష్మి, రాములుకు జీవన్‌దాన్ సంస్థ ప్రతినిధులు అవయవదానంపై అవగాహన కల్పించటంతో వారు అతడి అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు సైదులు శరీరం నుంచి 2 కిడ్నీలు, 2 కార్నియాస్, కాలేయం, గుండెను సేకరించి మరో ఆరుగురికి అమర్చినట్లు జీవన్‌దాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సైదులు భౌతికకాయాన్ని శనివారం గ్రామానికి తీసుకురాగా ఆయన స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు పెద్దఎత్తున ర్యాలీ తీసి అంత్యక్రియలు నిర్వహించారు.
ఫ బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి
అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు