
ప్రతిభ చాటితే భవిష్యత్తుకు ఉపకారం
తిరుమలగిరి( తుంగతుర్తి): చురుకుదనం, తెలివితేటలు, చదువుపై మంచి పట్టున్న విద్యార్థులు ఆర్థిక కారణాలతో చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి నేషనల్ మీన్స్‌కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం(ఎన్‌ఎంఎంఎస్) అమలు చేస్తోంది. 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఈ స్కాలర్‌షిప్ స్కీంకు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ నెల 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ స్కీం కింద ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.6వేల చొప్పున 9, 10, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల్లో కలిపి రూ.24వేలు అందించేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనానని రెండింతలు చేసింది. ఏటా ఇచ్చే మొత్తాన్ని రూ.12వేలకు పెంచింది. అంటే నాలుగేళ్లకు కలిపి విద్యార్థులు రూ.48వేలు అందుకోనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ 23న అర్హత పరీక్ష నిర్వహిస్తారు.
చొరవ చూపితే ఎంతో లబ్ధి
ఈ స్కీం గురించి సరైన ప్రచారం లేకపోవడం ఫలితంగా విద్యార్థులు ఎక్కువగా లబ్ధి పొందడం లేదు. 7వ తరగతిలో ఓసీ, బీసీ విద్యార్థులు 55 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులు పొంది, తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50లక్షల లోపు కలిగి ఉన్న వారంతా అర్హులు. 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు ఆధార్, ఆదాయ, కుల, నివాసం ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో ఈ పరీక్ష రాసేందుకు ముందుకు రావడం లేదని, ఉపాధ్యాయులు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. ఉపకార వేతనం రెట్టింపు కావడం, నోటిఫికేషన్ విడుదల కావడంతో విద్యాశాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముంది.
రాత పరీక్ష ఇలా..
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 3 గంటల పాటు రెండు విభాగాలుగా పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 90 ప్రశ్నలు(90 మార్కులు) ఇస్తారు. ఇందులో వెర్బల్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. రెండో విభాగంలో స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 90 ప్రశ్నలు(90 మార్కులు) ఇస్తారు. ఇందులో గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రంపై ప్రశ్నలు ఉంటాయి. 7వ తరగతిలోని పూర్తి సిలబస్, 8వ తరగతిలోని సగం సిలబస్‌పై ప్రశ్నలు అడుగుతారు.
ఫ ఈ నెల 14వ తేదీ వరకు
ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తునకు గడువు
ఫ ఏడాదికి రూ.12వేల చొప్పున
నాలుగేళ్ల పాటు స్కాలర్‌షిప్