
టెన్త్‌లో వందశాతం ఫలితాలు సాధించాలి
కేతేపల్లి, కట్టంగూర్: ప్రభుత్వ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించేలా కృషిచేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) బి.భిక్షపతి ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం ఆయన కేతేపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలతోపాటు కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజన నాణ్యత, విద్యార్థుల హాజరు రిజిస్టర్‌లను పరిశీలించారు. తరగతిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాసామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులు చదవటం, రాయటం అంశాలలో ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఆయన మాట్లాడారు. చదువులో వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలన్నారు. ఆయన వెంట కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య,, కేతేపల్లి జెడ్పీహెచ్‌ఎస్ కేతేపల్లి కాంప్లెక్స్ హెచ్‌ఎం వంటెపాక రఘు, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం అశ్విని, చెర్వుఅన్నారం హెచ్‌ఎం కందాల రమ, పీఎస్ హెచ్‌ఎం భీమయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్, నరహరి, పుల్లయ్య, నాగేష్ తదితరులు ఉన్నారు.
ఫ డీఈఓ భిక్షపతి