
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాధ్యతల స్వీకరణ
రామగిరి(నల్లగొండ): జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా డాక్టర్ ఎండి అబ్దుల్ హఫీజ్ ఖాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు
వేగవంతం చేయాలి
మునుగోడు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం మునుగోడు ఎంపీడీఓ కార్యాలయంలో చండూరు డివిజన్ పరిధిలోని ఐదు మండలాల తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈలు, ఏపీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఇళ్ల నిర్మాణాలను సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రారంభించిన ఇళ్లు వారం రోజుల్లో బేస్మెంట్ పనులు పూర్తిచేయించి బిల్లులు చెల్లించాలన్నారు. నిర్మాణ పనులు ప్రారంభించడంతో నిర్లక్ష్యం వహించిన మర్రిగూడ ఎంపీడీఓకి షోకాజ్ నోటీసు జారీచేయాలని ఆదేశించారు. అనంతరం మునుగోడు పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తన సెల్‌ఫోన్ లైట్ వేసుకుని రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ప్రతినెలా వైద్యపరీక్షలు చేయాలన్నారు. ఆమె వెంట హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, చండూరు ఆర్‌డీఓ శ్రీదేవి, మునుగోడు డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలు శాస్త్రరుక్తంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. ఇక ప్రాకరా మండపంలో శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాధ్యతల స్వీకరణ