డుమ్మా కొట్టలేరు..! | - | Sakshi
Sakshi News home page

డుమ్మా కొట్టలేరు..!

Aug 2 2025 6:12 AM | Updated on Aug 2 2025 6:12 AM

డుమ్మ

డుమ్మా కొట్టలేరు..!

నల్లగొండ : డుమ్మా టీచర్లకు ఇక చెక్‌ పడనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు విధానాన్ని విద్యాశాఖ తీసుకొచ్చింది. పాఠశాలలకు రాకుండా, విద్యార్థులకు పాఠాలు బోధించకుండా విధులకు గైర్హాజరతున్న ఉపాధ్యాయులను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. ఉపాధ్యాయుల హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు విధానాన్ని శుక్రవారం నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. సంబంధిత ఉద్యోగి సెల్‌ఫోన్‌లోనే టీజీఎఫ్‌ఆర్‌ఎస్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వారి హాజరును నేరుగా ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. గత విద్యా సంవత్సరం నుంచి ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ను ఉపయోగించి పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేస్తున్నారు. అదే తరహాలో ఉపాధ్యాయుల హాజరును కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.

జిల్లాలో 1483 ప్రభుత్వ పాఠశాలలు

జిల్లాలో 1483 ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, యూఆర్‌ఎస్‌, కేజీవీబీలు, మోడల్‌ స్కూల్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం 6,556 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల సమయ పాలనకు కొత్తగా ప్రవేశపెట్టి టీజీఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను సంబంధిత ఉద్యోగి స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేస్తారు. మొదటగా ఉద్యోగి వివరాలతో రిజిస్టర్‌ చేసుకొని లాగిన్‌ కావాలి. యాప్‌ ఇన్‌స్టాలేషన్‌ సమయంలోనే సంబంధిత కార్యాలయం, పాఠశాల ఆవరణ లాంగిట్యూడ్‌, లాటిట్యూడ్లను టెక్నీషియన్‌ అప్‌లోడ్‌ చేస్తారు. ఒక్కసారి లాగిన్‌ అయిన తరువాత యాప్‌ నిరంతరంగా వినియోగించవచ్చు. ఇక ఉద్యోగి ఉదయం నిర్దేశిత సమయానికి పాఠశాలకు వచ్చిన తర్వాత యాప్‌ను ఓపెన్‌ చేసి క్లాక్‌ ఇన్‌ అనే ఆప్షన్‌ నొక్కితే సదరు ఉద్యోగి వచ్చిన సమయం ఆన్‌లైన్‌లో సంబంధిత పర్యవేక్షణ అధికారికి చేరుతుంది. పాఠశాలలో పని సమయం ముగిసిన తర్వాత క్లాక్‌ ఔట్‌ అనే ఆప్షన్‌పై టచ్‌ చేస్తే ఉద్యోగి కార్యాలయాన్ని విడిచి వెళ్లే సమయాన్ని, పని చేసిన గంటలను లెక్కించి తిరిగి సంబంధిత పర్యవేక్షణ అధికారి ఆన్‌లైన్‌లో చేరుతుంది.

ఉత్తమ బోధనే లక్ష్యంగా..

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. విద్యార్థులకు ఉత్తమ బోధనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. చాలామంది పనిచేస్తున్న చోట నివాసం ఉండకుండా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ స్కూళ్లకు వేళకు చేరుకోవడం లేదు. ప్రధాపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పరం సహకరించుకుంటూ విధులకు హాజరు కాకున్నా మరుసటి రోజు రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలకు ఉపాధ్యాయులు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు రావడంతో ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు నమోదు అమల్లోకి తెచ్చింది. ఇక విద్యార్థులకు మరింతగా నాణ్యమైన, ఉత్తమ బోధన అందనుందని పలువురు విద్యా నిపుణులు పేర్కొంటున్నారు.

సాంకేతిక ఇబ్బందులు అధిగమిస్తాం

ఉపాధ్యాయులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా హాజరు నమోదులో మొదటిరోజు కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలతో కొందరు ఉపాధ్యాయులు హాజరు నమోదులో ఇబ్బందులు ఏర్పడ్డాయి. రెండుమూడు రోజుల్లో అవి పూర్తిగా పరిష్కారమవుతాయి. ప్రతి ఉపాధ్యాయుడు కచ్చితంగా ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4.15 గంటలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా హాజరు నమోదు చేయాల్సిందే. అలా చేయకపోతే గైర్హాజర్‌ ఆన్‌లైన్‌లో చూపుతుంది.

– భిక్షపతి, డీఈఓ

ఉపాధ్యాయులకు ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు అమలు

ఫ హాజరు పక్కాగా ఉండేలా విద్యాశాఖ చర్యలు

ఫ జిల్లాలో 1483 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు

ఫ 6,556 మంది ఉపాధ్యాయులు.. తొలిరోజు 3,854 మంది రిజిస్ట్రేషన్‌

ఫ మెరుగుపడనున్న విద్యా బోధన

మొదటి రోజు 3854 మంది నమోదు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించి తమ సెల్‌ఫోన్‌లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు విధానాన్ని రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. అయితే మొదటి రోజు ఆయా పాఠశాలల్లో 3854 మంది ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్‌ విధానం పూర్తయిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని టెక్నికల్‌ సమస్య వల్ల మొదటి రోజు 2,712 మంది ఇంకా రిజిస్టర్‌ చేసుకోలేదు. రెండు మూడు రోజుల్లో సాంకేతిక సమస్యలను అధిగమించి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేలా విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.

డుమ్మా కొట్టలేరు..!1
1/1

డుమ్మా కొట్టలేరు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement