
1600 మెగావాట్ల విద్యుత్
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని రెండు యూనిట్లలో ఉత్పత్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ద్వారా శుక్రవారం నుంచి 1600 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. జనవరి నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పవర్ ప్లాంట్‌లోని రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. దాంతో 800 మెగావాట్ల సామర్థ్యంతో కమర్షియల్ విద్యుదుత్పత్తి చేస్తుండగా, శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క యూనిట్–1 నుంచి జాతికి అంకితం చేశారు. దాంతో మరో 800 మెగావాట్లు కలుపుకొని 1600 మెగావాట్ల సామర్థ్యంతో కమర్షియల్ విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. వైటీపీఎస్ యూనిట్ –1 ప్రారంభం అనంతరం రూ.970 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. మరో మూడు యూనిట్లను వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులు ఆదేశించారు. పవర్ ప్లాంట్ ద్వారా మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే స్టేజ్–1లోని రెండు యూనిట్లను పూర్తి చేయడంపై ఆయన వైటీపీఎస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. పవర్ ప్లాంట్‌లో అన్ని సౌకర్యాలు బాగుండేలా.. అభివృద్ధి చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల, ఆస్పత్రి నిర్మించి పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు జరిగేలా చూడాలన్నారు. పవర్ ప్లాంట్ ఆవరణలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిర్వాసితులకు ఉద్యోగాలిస్తున్నాం :
మంత్రి ఉత్తమ్
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భూములు పోయిన పరిహారంతోపాటు ఉద్యోగాలు ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ మంజూరు అయ్యిందని.. ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదని, వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వైటీపీఎస్ వద్దకు రహదారుల పూర్తికి రూ.280 కోట్లు మంజూరు చేయడంతోపాటు.. క్లీయరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో పవర్ స్టేషన్ ఏర్పాటు చేసినప్పటికీ సామాజిక బాధ్యతగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాజెక్టు నుంచి ఎలాంటి సహకారం అందించడం లేదన్నారు. రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ వైటీపీఎస్‌లోని అన్ని విభాగాల్లో లాగ్‌బుక్ ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరిగా చేయాలని, ప్రతి ఉద్యోగి కార్డుతోనే యాక్సెస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జెన్‌కో సీఎండీ డాక్టర్ హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైటీపీఎ్‌స్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై.రాజశేఖర్‌రెడ్డి, జెన్‌కో సివిల్ డైరెక్టర్ అజయ్, జెన్‌కో హెచ్‌ఆర్ డైరెక్టర్ కుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
చివరి దశకు చేరుకున్న నాలుగో యూనిట్ పనులు
పవర్ ప్లాంట్‌లోని 3, 4, 5 యూనిట్ల పనులు కొనసాగుతున్నాయి. నాలుగో యూనిట్ పనులు చివరి దశకు చేరుకున్నారు. గత ఏడాది నవంబర్‌లోనే నాలుగో బాయిలర్ లైటింగ్ (స్టీమ్ జనరేషన్) పనులు పూర్తికాగా, ప్లాంట్ సింక్రనైజేషన్‌కు సంబంధించి బాయిలర్ స్టీమ్ బ్లోయింగ్ ఆపరేషన్, నార్మలైజేషన్ పనులను ఈ నెల చివరి నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక యూనిట్–3 బాయిలర్ లైటింగ్ పనులు గత ఏడాది ఫిబ్రవరిలోనే పూర్తి కాగా, బాయిలర్ కెమికల్ క్లీనింగ్ కూడా పూర్తయింది. ఇక స్టీమ్ బ్లోయింగ్ ఆపరేషన్ పనులను గత నెల 22వ తేదీన ప్రారంభించారు. మొత్తానికి యూనిట్–3 సింక్రనైజేషన్‌ను వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి, అక్టోబర్‌లో కమర్షియల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా పనులను చేపట్టారు. యూనిట్–5 బాయిలర్ హైడ్రాలిక్ పరీక్ష పూర్తికాగా, బాయిలర్ లైటింగ్ పనులను ఈ నెలలోనే చేపట్టేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన టర్బైన్ నిర్మాణ పనులను ఇంకా కొనసాగుతున్నాయి. డిసెంబర్‌లో సింక్రనైజేషన్ పూర్తి చేసి, 2026లో ఫిబ్రవరిలో కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్ పేర్కొంది.
ఫ ఈ ఏడాది జనవరిలో సీఎం చేతుల మీదుగా యూనిట్–2 ప్రారంభం
ఫ శుక్రవారం యూనిట్–1ను జాతికి అంకితం చేసిన డిప్యూటీ సీఎం భట్టి
ఫ వచ్చే ఏడాది జనవరి నాటికి మిగతా మూడు యూనిట్లు పూర్తి చేయాలని ఆదేశం
ఫ టౌన్‌షిప్ పనులకు శంకుస్థాపన
ఫ పనులపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి సమీక్ష

1600 మెగావాట్ల విద్యుత్

1600 మెగావాట్ల విద్యుత్

1600 మెగావాట్ల విద్యుత్