రూ.1800 కోట్లతో ‘డిండి’ పనులు
దేవరకొండ : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతలకు నీటిని తరలించేందుకు ప్రతిపాదించిన పనులకు రూ.1,800 కోట్లతో ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపినట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. మంగళవారం దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నల్లగొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, నాగర్‌కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అమరేందర్‌తో పాటు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే సింగరాజుపల్లి, గొట్టిముక్కల, కిష్టరాయినిపల్లి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్న ధృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఏదుల నుంచి 2.52 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్‌తోపాటు 16 కిలోమీటర్ల సొరంగం ఆ తర్వాత మరో 3.05 కిలోమీటర్ల కాల్వ నిర్మించి డిండికి నీళ్లు మళ్లించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను పూర్తిచేసి తాగు, సాగునీరు అందిస్తామన్నారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ నటరాజన్, ఇరిగేషన్ సీఈ అజయ్‌కుమార్, ఆర్డీఓలు రమాణారెడ్డి, శ్రీను, శ్రీదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే బాలునాయక్


