జగ్జీవన్‌రామ్ జయంతిని విజయవంతం చేయాలి
నల్లగొండ : నల్లగొండలో ఈ నెల 5న నిర్వహించనున్న బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో కోరారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు నల్లగొండ ఎన్జీ కాలేజీ ఎదురుగా నిర్వహించనున్న జయంతి ఉత్సవాలకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఇతర అన్ని సంఘాల నాయకులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
ఒకేషనల్ పరీక్షకు
37 మంది గైర్హాజరు
నల్లగొండ : పదో తరగతి ఒకేషనల్ పరీక్షలు గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 2,597 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 2,560 మంది హాజరయ్యారు. 37 మంది గైర్హాజరైనట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
మాడుగులపల్లి : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి పి.శ్రవణ్‌కుమార్ అన్నారు. గురువారం మాడ్గులపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎ–గ్రేడ్ వరి ధాన్యం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2320, సాధారణ రకానికి రూ.2300 ఇస్తోందని.. సన్న రకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తుందని తెలిపారు. రైతులు 17శాతం తేమ ఉండేలా నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధరతోపాటు బోనస్ పొందాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శివరాంకుమార్, ఏఈఓలు శిరీష, వేణుగోపాల్, పార్వతి, రైతులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి తులసీ దళాలతో అర్చించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
జగ్జీవన్‌రామ్ జయంతిని విజయవంతం చేయాలి


