విద్యాశాఖలో పరస్పర బదిలీలు
నల్లగొండ : విద్యాశాఖలో పరస్పర బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో నల్లగొండ జిల్లా నుంచి 24 మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు బదిలీ అవుతుండగా.. వేరే జిల్లాల నుంచి నల్లగొండకు 24 మంది ఉపాధ్యాయులు రానున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాల విభజన తర్వాత జోన్లను విభజించింది. ఆ సందర్భంలో జోన్ల వారీగా బదిలీలు చేయడంతో నల్లగొండ జిల్లాకు చెందినవారు నుంచి ఇతర జిల్లాలకు పెద్ద ఎత్తున బదిలీలు అయ్యారు. ఇతర జిల్లాల నుంచి కూడా నల్లగొండ జిల్లాకు పెద్ద ఎత్తున బదిలీపై వచ్చారు. దీంతో వారంతా కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలంటూ ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరస్పర బదిలీలకు అవకాశం ఇచ్చింది. దీంతో ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారు నల్లగొండ జిల్లాకు బదిలీపై వస్తే వారి స్థానంలో నల్లగొండ జిల్లాలో పని చేస్తున్న వారు ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు.
కలిసి దరఖాస్తు చేసుకున్న వారినే..
పరస్పర బదిలీలకు సంబంధించి ఇరువురు కలిసి దరఖాస్తు చేసుకున్న వారి బదిలీలను మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది. దీంతో నల్లగొండ జిల్లా నుంచి భువనగిరి, సూర్యాపేట, మేడ్చల్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్ జిల్లాలకు 24 మంది ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. వారి స్థానంలో నల్లగొండ జిల్లాకు 24 మంది ఇతర జిల్లాల నుంచి రానున్నారు.
ఫ జిల్లా నుంచి వెళ్లనున్న 24 మంది
ఫ అదే సంఖ్యలో నల్లగొండ జిల్లాకు రానున్న ఉపాధ్యాయులు


